పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్లారిటీ.. చల్లారని దుమారం | Sakshi
Sakshi News home page

పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్లారిటీ.. చల్లారని దుమారం

Published Thu, Apr 25 2024 4:45 PM

Sam Pitroda Remark Bjp New Attack On Congress

కాంగ్రెస్‌ ఓవర్‌సీస్‌ ఛైర్మన్‌ శామ్ పిట్రోడా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి. ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ కన్నుపడిందన్న ప్రధాని మోదీ విమర్శలకు మరింత ఆజ్యం పోశాయి. పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చినా దుమారం చల్లారలేదు.

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు.. హస్తం పార్టీని వివాదంలోకి నెట్టేశాయి. అమెరికా తరహాలో భారత్‌లోనూ వారసత్వ పన్ను విధించడంపై చర్చ జరగాలంటూ బాంబు పేల్చారు పిట్రోడా.  వారసత్వ పన్ను విధానం ప్రకారం.. అమెరికాలో ఓ వ్యక్తి మరణిస్తే, అతని ఆస్తుల్లో 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. భారత్‌లో ఇలాంటి విధానం లేదని.. దీనిపై  చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
 
పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. పిట్రోడా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. ప్రజల ఆస్తుల్ని దోచేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు.ప్రధాని మోదీ విమర్శలకు కాంగ్రెస్‌ కౌంటర్ ఇచ్చింది. పిట్రోడా ప్రకటనకు.. పార్టీకి సంబంధం లేదని.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టంచేసింది. ఈ విషయంలో బీజేపీ కావాలని రాద్దాంతం చేస్తోందని ఆక్షేపించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్‌.

మరోవైపు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే హామీపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందో తెలుసుకునేందుకే సర్వే చేస్తాం అంటున్నామని.. ఈ సర్వే తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పలేదన్నారు. ఈ సర్వేతో అసలు సమస్య ఏంటో, ఎక్కడుందో అర్థమవుతుందంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

శామ్ పిట్రోడా ప్రస్తావించిన వారసత్వ ఆస్తిపై పన్ను విధానం.. భారత్‌లో 1985లోనే రద్దయ్యింది. అప్పట్లో దీనిని ఎస్టేట్ ట్యాక్స్ అని పిలిచేవారు. 20లక్షలకుపైగా విలువైన ఆస్తులు వారసత్వంగా దక్కితే.. దాదాపు 85శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్, దక్షిణ కొరియాలో ఈ ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ అమల్లో ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement