బీహార్‌ లోక్‌సభ ఎన్నికలు.. పోలింగ్‌ సమయం పెంపు | Sakshi
Sakshi News home page

బీహార్‌ లోక్‌సభ ఎన్నికలు.. పోలింగ్‌ సమయం పెంపు

Published Thu, Apr 25 2024 4:54 PM

Ec Extends Poll Timings In Some Assembly Segments Of 4 Bihar Ls Seats

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎన్నికల సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది. 

నోటిఫికేషన్ ప్రకారం, బంకా, మాధేపురా, ఖగారియా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. అయితే వేడిగాలుల దృష్ట్యా పోలింగ్‌ శాతాన్ని పెంచేలా ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పొడిగించాలని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్‌ సమయాన్ని  మార్చాలని నిర్ణయించింది. 

ఈ లోక్‌సభ స్థానాలకు చెందిన వివిధ అసెంబ్లీ సెగ్మెంట్‌లలోని కొన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల సంఘం ఇప్పుడు పోలింగ్‌ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేలా నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల పరిధిలోని ఇతర పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.
 
సాధారణ పోల్ సమయాలు ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు ఉంటాయి. అయితే అవి భూభాగం, సూర్యాస్తమయం సమయం, భద్రతా పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి.

Advertisement
Advertisement