Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష

Published Sat, May 4 2024 4:41 AM

Lok sabha elections 2024: Samajwadi Party is swinging focus from Muslims and Yadavs

యూపీలో మూడో దశలో 10 చోట్ల పోలింగ్‌ 

యాదవులు, ముస్లింల ప్రాబల్య ప్రాంతాలే 

కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల పోరు పశి్చమ యూపీ నుంచి యాదవ భూమికి చేరింది. బ్రజ్, రోహిఖండ్‌ ప్రాంతాల్లోని 10 లోక్‌సభ స్థానాలకు 7న మూడో విడతలో పోలింగ్‌ జరగనుంది. యాదవులు, ముస్లింలు ఒక్కటైతే అక్కడ వారి తీర్పే ఫైనల్‌. వారి ఓట్లపైనే ఆశలు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీకి మూడో విడత అగ్నిపరీక్ష కానుంది. యూపీలో తొలి రెండు విడతల్లో జాట్‌ బెల్ట్‌గా భావించే పశి్చమ యూపీలోని 16 స్థానాలకు పోలింగ్‌ ముగియడం తెలిసిందే...   

సంభల్‌ 
యాదవ ఆధిపత్య స్థానమిది. దివంగత ఎస్పీ దిగ్గజం ములాయం సింగ్‌ యాదవ్‌ 1998, 1999ల్లో ఇక్కడి నుంచే లోక్‌సభకు వెళ్లారు. 2004లోనూ ఎస్పీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత సత్యపాల్‌ సింగ్‌ సైని గెలిచారు. 2019లో ఎస్పీ నేత షఫీకుర్‌ రెహమాన్‌ బార్క్‌ భారీ విజయం సాధించారు. ఆయన అనారోగ్యంతో కన్నుమూయడంతో ఈసారి మనవడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జియావుర్‌ రెహమాన్‌కు ఎస్పీ టికెటిచి్చంది. బీజేపీ మళ్లీ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర్‌ లాల్‌ సైనీనే రంగంలోకి దింపింది. బీఎస్పీ నుంచి షౌలత్‌ అలీ పోటీ చేస్తున్నారు.

హథ్రస్‌  
ఈ ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం 1991 నుంచీ బీజేపీ కంచుకోట. కాంగ్రెస్‌ అయితే 1971 తర్వాత ఇక్కడ ఎన్నడూ గెలవలేదు! ఇక ఎస్పీ, బీఎస్పీ ఈ స్థానంలో ఒక్కసారి కూడా గెలుపు ముఖమే చూడలేదు! 2009లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆరెల్డీ ఇక్కడ విజయం సాధించింది. 2019లో ఎస్పీ అభ్యర్థి రామ్‌జీ లాల్‌ సుమాన్‌పై బీజేపీ అభ్యర్థి రాజ్‌వీర్‌ సింగ్‌ దిలార్‌ 2.6 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 66 ఏళ్ల దిలార్‌ ఏప్రిల్‌ 24న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో బీజేపీ టికెట్‌ అనూప్‌ ప్రధాన్‌కు లభించింది. ఎస్పీ తరఫున జస్వీర్‌ వాలీ్మకి పోటీ చేస్తున్నారు.

బరేలీ  
కేంద్ర మాజీ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ ఇక్కడి నుంచి ఎనిమిదిసార్లు బీజేపీ తరఫున గెలిచారు! ఒక్క 2009 మినహాయిస్తే 1989 నుంచి అన్ని ఎన్నికల్లో గంగ్వార్‌దే గెలుపు! ఈసారి మాత్రం బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది. అదే సామాజిక వర్గానికి చెందిన ఛత్రపాల్‌ సింగ్‌ గంగ్వార్‌కు టికెటిచి్చంది. ఎస్పీ నుంచి ప్రవీణ్‌ సింగ్‌ అరాన్‌ బరిలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి చోటేలాల్‌ గంగ్వార్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురవడం ఆ పారీ్టకి షాకిచి్చంది. దీంతో ఇక్కడ ద్విముఖ పోటీయే నెలకొంది.

ఫతేపుర్‌ సిక్రీ 
2009లో ఈ స్థానాన్ని బీఎస్పీ సొంతం చేసుకుంది. గత రెండు ఎన్నికల నుంచి మాత్రం బీజేపీదే విజయం. 2019లో ఆ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్‌ చాహర్‌ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ బబ్బర్‌కు 1.72 లక్షల ఓట్లు పోలైతే, చాహర్‌ ఏకంగా 6.67 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు! దాంతో ఈ విడత కూడా చాహర్‌కే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్‌ నుంచి రామ్‌నాథ్‌ సికర్‌వార్, బీఎస్పీ నుంచి రామ్‌నివాస్‌ శర్మ పోటీలో ఉన్నారు. ఎస్పీ మాజీ నేత భగవాన్‌ శర్మ (గుడ్డూ పండిట్‌) స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో ఉండటం కాంగ్రెస్‌కు ప్రతికూలం కానుంది.

బదాయూ 
ఎస్పీకి కీలకమైన స్థానమిది. 1996 నుంచి 2014 దాకా ఆ పారీ్టకి కంచుకోట. 2009, 2014ల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌ నెగ్గారు. 2019లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య ఆయనపై కేవలం 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విడత దురి్వజయ్‌ శాక్యను బీజేపీ పోటీలో దించింది. ఎస్పీ కూడా సీనియర్‌ నేత శివపాల్‌ యాదవ్‌ ఒత్తిడితో ఆయన కుమారుడు ఆదిత్యకు టికెటిచ్చింది. ధర్మేంద్ర యాదవ్‌ను పక్కన పెట్టడం దానికి ప్రతికూలంగా మారొచ్చంటున్నారు.

ఫిరోజాబాద్‌ 
ఇదీ ఎస్పీ ఆధిపత్యమున్న స్థానమే. 2009లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, 2014లో ఆయన సోదరుడు అక్షయ్‌ యాదవ్‌ విజయం సాధించారు. 2019లో మాత్రం ఫిరోజాబాద్‌ బీజేపీ పరమైంది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ చంద్రసేన్‌ జడాన్‌ 28 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎస్పీ అభ్యర్థి అక్షయ్‌ యాదవ్‌పై గెలిచారు. ఈసారి ఎస్పీ నుంచి మళ్లీ అక్షయ్‌ బరిలో ఉన్నారు. బీజేపీ మాత్రం సిట్టింగ్‌ ఎంపీని మార్చి విశ్వదీప్‌ సింగ్‌కు టికెటిచి్చంది.

ఎటా 
ఆది నుంచీ బీజేపీని ఆదరిస్తున్న స్థానమిది. 1999, 2004 ఎన్నికల్లో మాత్రం ఎస్పీ నెగ్గింది. 2009 ఎన్నికల్లో యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం విశేషం! ఆయన కుమారుడు రాజ్‌వీర్‌సింగ్‌ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ తరఫున దవేశ్‌ శాక్య, బీఎస్పీ నుంచి మహమ్మద్‌ ఇర్ఫాన్‌ బరిలో ఉన్నారు.

ఆవ్లా 
1989 నుంచి బీజేపీ ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. 2009 నుంచి ఆ పారీ్టకే ఇక్కడి ఓటర్లు పట్టం కడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ గెలిచిన ధర్మేంద్ర కశ్యప్‌కే ఈసారి కూడా బీజేపీ టికెట్‌ దక్కింది. ఎస్పీ నుంచి నీరజ్‌ మౌర్య, బీఎస్పీ తరఫున అబిద్‌ అలీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2014లో ఎస్పీ, 2019 ఎన్నికల్లో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచాయి.

బీజేపీ హవా కొనసాగేనా!? 
మూడో విడతలో పోలింగ్‌ జరిగే 10 స్థానాల్లో ఎనిమిది 2019లో బీజేపీ గెలుచుకున్నవే. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి బరిలో దిగగా బీఎస్పీ ఒంటరి పోరు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వాటి మధ్య చీలితే బీజేపీ లాభపడనుంది. ఈ 10 లోక్‌సభ స్థానాల్లో ముస్లింలతో పాటు ఓబీసీలు, ముఖ్యంగా యాదవ్‌ల పాటు ఓట్లు ఎక్కువ. ఎటా, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, బుదౌన్, సంభాల్‌ యాదవ ప్రాబల్య స్థానాలు. సంభాల్, ఆవ్లా, ఫతేపుర్‌ సిక్రీ, ఆగ్రా, ఫిరోజాబాద్‌ల్లో ముస్లిం ఓటర్లు 13 శాతమున్నారు. బరేలీలోనైతే ఏకంగా 33 శాతం దాకా ఉంటారు! ఇతర లోక్‌సభ స్థానాల్లో లోధ్, కచి్చ, శాక్య, మురావోల ప్రాబల్యమూ ఉంది.

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement