Lok sabha elections 2024: వాజ్‌పేయి మేజిక్‌ | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: వాజ్‌పేయి మేజిక్‌

Published Thu, Apr 25 2024 3:34 PM

Lok sabha elections 2024: 1999 Indian Parliamentary Elections and the New BJP-led Coalition Government

మూడోసారి ఐదేళ్ల పాలన

ఎన్డీఏ సంకీర్ణం సూపర్‌హిట్‌

ప్రాంతీయ పార్టీల దన్ను లేనిదే        సంపూర్ణ ఆధిక్యం అసాధ్యమని గుర్తించిన బీజేపీ 13వ లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 20కి పైగా    పార్టీలను నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) గూటి కిందకు తెచ్చి మెజారిటీ సాధించింది. సొంత బలం పెరగకున్నా భాగస్వాముల సాయంతో మళ్లీ అధికారంలోకి వచ్చి దేశాన్ని ఐదేళ్లూ విజయవంతంగా పాలించింది. కాంగ్రెస్‌ మాత్రం అంతర్గత సంక్షోభంతో బాగా దెబ్బ తిన్నది..

1998 ఎన్నికల తర్వాత బీజేపీ ఏర్పాటు చేసిన నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) జాతీయ రాజకీయాల్లో పార్టీ గ్రాఫ్‌ బలపడేందుకు దోహదపడింది. దీనికి వాజ్‌పేయి తొలి చైర్మన్‌ కాగా జార్జ్‌ ఫెర్నాండెజ్‌ కనీ్వనర్‌. బీజేపీతో పాటు జేడీ         (యూ), శివసేన, టీడీపీ, జేడీ(ఎస్‌) కూటమిలో ముఖ్ పార్టీలుగా ఉన్నాయి. 1999 లోక్‌సభ ఎన్నికలు సెపె్టంబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 3 దాకా ఐదు దశల్లో జరిగాయి.

కార్గిల్‌ యుద్ధం, ఫోఖ్రాన్‌ అణు పరీక్షలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాజ్‌పేయి చరిష్మా కూడా తోడై ఎన్‌డీఏకు 298 స్థానాలు దక్కాయి. 1984 తర్వాత ఏ పార్టీకైనా, సంకీర్ణానికైనా లోక్‌సభలో మెజారిటీ దక్కడం అదే తొలిసారి. బీజేపీకి 182 సీట్లొస్తే కాంగ్రెస్‌ 114తో పరిమితమైంది.

సీపీఎం 33, టీడీపీ 29, సమాజ్‌వాదీ 26, జేడీయూ 21 సీట్లు గెలుచుకున్నాయి. సీపీఐకి కేవలం నాలుగు సీట్లే రావడంతో జాతీయ పార్టీ హోదా కోల్పోయింది! ఫలితాల అనంతరం డీఎంకే వంటి మరిన్ని పార్టీలు చేరడంతో ఎన్డీఏ కూటమి మరింత బలపడింది. అక్టోబర్‌ 13న ప్రధానిగా వాజ్‌పేయి మూడోసారి ప్రమాణం చేశారు. మొత్తమ్మీద 1996 నుంచి 1999 మధ్య మూడేళ్లలో లోక్‌సభకు ఏకంగా మూడుసార్లు ఎన్నికలు జరగడం విశేషం!

కాంగ్రెస్‌లో సంక్షోభం
కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదికే పార్టీలో ముసలం మొదలైంది. జన్మతః విదేశీయురాలైన సోనియాను ప్రధాని అభ్యరి్థగా అంగీకరించేందుకు సీనియర్‌ నేతలు శరద్‌ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్‌ అన్వర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కలత చెందిన సోనియా రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ ఆమెకు మద్దతుగా నిలిచింది.

కార్యకర్తలు నిరసనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించారు. చివరికి 1999 మే 20న పవార్, సంగ్మా, అన్వర్‌పై కాంగ్రెస్‌ బహిష్కరణ వేటు వేసింది. దాంతో సోనియా రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీ సారథిగా కొనసాగారు. ఈ పరిణామం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. బీజేపీ ‘స్వదేశీ వాజ్‌పేయి – విదేశీ సోనియా’ నినాదాన్ని ఎత్తుకుంది. సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌కు అవే తొలి        ఎన్నికలు.

పవార్‌ సొంత పార్టీ
సోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నించి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచి్చన శరద్‌పవార్, పీఏ సంగ్మా, తారిఖ్‌ అన్వర్‌ జూన్‌ 10న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. తొలి ఎన్నికల్లోనే 2.27 శాతం ఓట్లతో 8 స్థానాలను కైవసం చేసుకున్నారు.

 

గుజరాత్‌ అల్లర్లు
నరేంద్ర మోదీ పాలనలోని గుజరాత్‌లో 2002 ఫిబ్రవరిలో చెలరేగిన మత ఘర్షణలతో వాజ్‌పేయి సర్కారు బాగా అప్రతిష్టపాలైంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు అల్లరి మూకలు నిప్పంటించడంతో అయోధ్య నుంచి తిరిగొస్తున్న 59 మంది హిందూ భక్తులు మరణించారు. తర్వాత నెల పాటు చెలరేగిన హింసలో వెయ్యి మందికి పైనే చనిపోయారు. ఈ హింసాకాండను వాజ్‌పేయి ఖండించినా దాన్ని అరికట్టలేదన్న అపవాదు మూటగట్టుకున్నారు.

విశేషాలు...
► ప్రధానిగా వాజ్‌పేయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి పేరిట హైవేలను విస్తరించారు. ప్రధాని గ్రామీణ్‌ సడక్‌ యోజనతో రూరల్‌ రోడ్లకు అక్షరాలా మహర్దశ పట్టింది.
► టెలికం సేవల విస్తరణకు కీలక అడుగులు పడ్డాయి. లైసెన్స్‌ ఫీజుల స్థానంలో ఆదాయ పంపిణీ విధానం ప్రవేశపెట్టారు. 2000 సెపె్టంబర్‌ 15న బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఏర్పాటు చేశారు.
► ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఏర్పాటైంది. బాల్కో, హిందుస్థాన్‌ జింక్, ఐపీసీఎల్, వీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి అగ్రగామి కంపెనీలను ప్రైవేటీకరించారు.
►పెట్రోలియం ధరలపై నియంత్రణ ఎత్తేయడానికి వాజ్‌పేయి సర్కారే బీజం వేసింది.

13వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు
(మొత్తం స్థానాలు 543)  
పార్టీ                  స్థానాలు  
బీజేపీ                   182
కాంగ్రెస్‌                  114
సీపీఎం                    33
టీడీపీ                      29
సమాజ్‌వాదీ              26
జేడీ(యూ)                21
శివసేన                     15
బీఎస్పీ                      14
ఇతరులు                  109  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement