ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక | Sakshi
Sakshi News home page

ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక

Published Fri, May 3 2024 3:45 PM

Why Jyothika Not Casting Her Vote In Tamil Nadu Lok Sabha Elections

లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్‌ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలు అందరూ  పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్‌ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.

సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు  కాస్త బ్రేక్‌ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్‌ హిట్‌ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్‌లతో పుల్‌ బిజీ అయ్యారు. ప్రస్తుతం  జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. 

తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్‌లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. 

జ్యోతిక ఎక్కువగా సోషల్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement