జిల్లాకు చేసిన మేలు చెప్పగలరా! | Sakshi
Sakshi News home page

జిల్లాకు చేసిన మేలు చెప్పగలరా!

Published Sat, May 4 2024 9:15 AM

జిల్లాకు చేసిన మేలు చెప్పగలరా!

కడప కార్పొరేషన్‌: పద్నాలుగేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో ఈ జిల్లాకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కె. సురేష్‌ బాబు టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ కరిముల్లాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసి చంద్రబాబుకు కళ్లుకుట్టి, కడుపుమంటతో విమర్శలు చేశారన్నారు. ఆయన కడపలో సభ నిర్వహించిన ఏడురోడ్ల కూడలి గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడెలా ఉందో చూడాలన్నారు. చంద్రబాబు పాలనలో చెప్పుకోదగిన ఒక్క మంచి పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. 2014లో 680 హామీలిచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, అధికారాన్ని ఉపయోగించి తమ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే వారు చేసిన ఘనత అని ధ్వజమెత్తారు. కూటమి మేనిఫెస్టోను ప్రజలెవరూ నమ్మ డం లేదన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కులమతాలు, పార్టీలకతీతంగా అర్హులైతే చాలు సంక్షేమ పథకాలు ఇచ్చారన్నారు. కడపలో సుమారు రూ.2400కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వైఎస్‌ జగన్‌ వచ్చాకే గండికోటలో 26 టీఎంసీలు, బ్రహ్మంసాగర్‌లో 17టీఎంసీలు నిల్వ చేయడం జరిగిందన్నారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై విమర్శలు సరికాదన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను అవినీతి చేసి ఉంటే కడప ప్రజలు ఇన్ని సార్లు తనను గెలిపించేవారు కాదన్నారు.

విద్య, వైద్య రంగాలకు పెద్దపీట: ఎమ్మెల్సీ

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పకుండా వైఎస్సార్‌సీపీని విమర్శించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

చంద్రబాబును ప్రశ్నించిన

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు

Advertisement
Advertisement