రేపటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Published Sat, May 4 2024 9:15 AM

రేపటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

కడప సెవెన్‌రోడ్స్‌: పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే కార్యక్రమం ఈనెల 5 నుంచి 7వ తేది వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. పోలింగ్‌ సిబ్బంది 14,640 మందికిగాను 13,536 మంది తమ పోస్టల్‌ బ్యాలెట్లను ఈనెల 5వ తేది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో వినియోగించుకుంటారన్నారు. ఇతర జిల్లాలకు చెందిన 3570 మంది రిజిష్టర్డ్‌ ఓటర్లకు కూడా అదేరోజు పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటువేసే అవకాశం కల్పించామన్నారు. ఈనెల 6, 7 తేదీలలో హోమ్‌ ఓటింగ్‌ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 85 ఏళ్లు పైబడిన వారు 7365 మందికిగాను 519 మంది, 18,532 మంది దివ్యాంగులకు గాను 359 మంది కలిపి మొత్తం 878 మంది హోమ్‌ ఓటింగ్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. వీరు కూడా పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటు వేస్తారని చెప్పారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే 2731 మంది పోలీసు సిబ్బంది, 352 మంది అత్యవసర సర్వీసులకు చెందిన సిబ్బంది, ఇతర పోలింగ్‌ విధులు నిర్వర్తించే 2136 మంది ఈనెల 6వ తేది తమ పోస్టల్‌ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల వద్ద వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇలా మొత్తం 23,203 మంది జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఓటరు ఇన్ఫర్మేషన్‌ స్లిప్పులు, ఓటరు గైడ్‌ పంపిణీ కార్యక్రమం ఈనెల 6వ తేది నాటికి ముగుస్తుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ కేసుల వివరాలను పత్రికల ద్వారా వెల్లడించాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో 38 పోలింగ్‌ కేంద్రాలు వల్నరబుల్‌ కింద ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 14కు తగ్గిందని పేర్కొన్నారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వెబ్‌ కాస్టింగ్‌ ఉంటుందన్నారు. ముద్దనూరు మండలంలోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో సిగ్నల్స్‌ లేవన్నారు. ఆపరేటర్‌ ద్వారా పోలీసుస్టేషన్‌, రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి అనుసంధానం చేస్తామన్నారు.

నియోజకవర్గం ఫెసిలిటేషన్‌ కేంద్రం

23,203 పోస్టల్‌ బ్యాలెట్లు

నియోజకవర్గ కేంద్రాల్లోఫెసిలిటేషన్‌ సెంటర్లు

జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు

124–బద్వేలు జెడ్పీ బాలుర హైస్కూలు

126–కడప గాంధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూలు

129–పులివెందుల అహోబిళాపురం ప్రభుత్వ హైస్కూలు

130–కమలాపురం బీఎస్‌ఎస్‌ఎస్‌ బాలికల హైస్కూలు

131–జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల

132–ప్రొద్దుటూరు అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూలు, టీబీ రోడ్డు

133–మైదుకూరు జెడ్పీ బాలుర హైస్కూలు

జిల్లా ఫెసిలిటేషన్‌ సెంటర్‌: జయనగర్‌ మున్సిపల్‌ బాలికల హైస్కూలు

Advertisement
Advertisement