అభిమాన సంద్రం | Sakshi
Sakshi News home page

అభిమాన సంద్రం

Published Sat, May 4 2024 4:35 AM

అభిమా

తీరం పోటెత్తిందా.. గోదావరి ఉప్పొంగిందా అన్నట్టు నరసాపురం జన సునామీని తలపించింది.. జై జగన్‌.. జయహో జగన్‌ నినాదాలతో హోరెత్తింది.. తమ అభిమాన నేతను చూసేందుకు.. సంక్షేమ సారథికి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు అశేషంగా తరలివచ్చారు.. మండుటెండలోనూ సీఎం జగన్‌ కోసం వేచి ఉన్నారు.. ఆయన ప్రసంగానికి ఆద్యంతం జయజయధ్వానాలు పలికారు. కూటమి నేతలను తిప్పికొడతామంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నరసాపురం స్టీమర్‌ రోడ్డులో నిర్వహించిన ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

సాక్షి, భీమవరం: నరసాపురంలోని స్టీమర్‌ రోడ్డులో వైఎస్సార్‌సీపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ఉదయం 10.30 గంటలకు సభ కాగా 8 గంటల నుంచే నరసాపురం, పరిసర నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకోవడం కనిపించింది. చెంతకు వస్తున్న అభిమాన నేతను చూసేందుకు చిన్నాపెద్దా తేడాలేకుండా వృద్ధులు, మహిళలు, యువత, చిన్నారులు సభకు పోటెత్తారు. తీన్‌మార్‌ వాయిద్యాలు, మోటార్‌ సైకిల్‌ ర్యాలీలతో యువత హోరెత్తించారు. నిర్ణీత సమయానికి స్టీమర్‌ రోడ్డు లోని సభాప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది. వెల్లువలా తరలివచ్చిన జనాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

మండుటెండనూ లెక్కచేయక..

ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. ఉక్కపోతతో చెమటలు కారుతున్నా, ఎండ తీవ్రత తాళలేకున్నా అభిమాన నేత రాక కోసం ప్రజలు బారులుతీరి ఎదురుచూశారు. గంటన్నర పాటు సీఎం జగన్‌ రాక ఆలస్యమైనా అంతటి మండుటెండలోనూ చెక్కుచెదరకుండా వేచి ఉండటం విశేషం. వైఎస్సార్‌సీపీ గీతాలకు జెండాలు ఊపుతూ యువత నృత్యాలు చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. ప్రచార రథం పక్కనే ఆస్పత్రి భవనం వద్ద ప్రచార గీతాలకు లయబద్ధంగా యువతి చేసిన నృత్యం చూసి పార్టీ నేతలు అభివాదం చేస్తూ అభినందించారు. ఉదయం 11.40 గంటల సమయంలో సభా ప్రాంగణం మీదుగా టేలర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటున్న సీఎం జగన్‌ హెలికాప్టర్‌ను చూసి చేతులు ఊపుతూ ప్రజలు స్వాగతం పలికారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పార్టీ శ్రేణుల ద్వారా సభలోని వారికి విరామం లేకుండా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు అందించారు. ఉదయం 11.55 గంటల సమయంలో సీఎం జగన్‌ కాన్వాయ్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, యువకులు కాన్వాయ్‌ వెంట ర్యాలీగా వచ్చారు. సభలోని వారికి బస్సులోంచి చేతులు ఊపుతూ సీఎం జగన్‌ సభాస్థలిలోని ప్రచారం రథంపైకి చేరుకున్నారు.

అలసటను దూరం చేసిన ఆప్యాయత

‘నరసాపురం సిద్ధమా?.. సమయం 12.15 మిట్ట మధ్యాహ్నం. ఇంతటి ఎండలో ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్‌ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు అప్పటివరకు ప్రజలు పడిన అలసటను దూరం చేశాయి.

సీఎం జగన్‌ ప్రసంగంతో నయా జోష్‌

దాదాపు అరగంట పాటు సాగిన సీఎం జగన్‌ ప్రసంగం ఆద్యంతం ప్రజల్లో ఉత్సాహం నింపింది. జై జగన్‌.. సీఎం.. సీఎం అంటూ సభా ప్రాంగణమంతా నినాదాలతో హోరెత్తింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్‌ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా? అంటూ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు.

జయజయధ్వానాలు

సీఎం జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం

మండుటెండనూ లెక్కచేయని వైనం

స్టీమర్‌ రోడ్డులో సభకు పోటెత్తిన జనం

కూటమిని తిప్పికొడతామంటూ మద్దతు

అభిమాన సంద్రం
1/1

అభిమాన సంద్రం

Advertisement
Advertisement