ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

Published Sat, May 4 2024 4:10 AM

ఆరోగ్

నర్సంపేట : ఆరోగ్యంపై విద్యార్థులు శ్రద్ధచూపాలని నర్సంపేటలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ హబ్‌ క్వాలిటీ మేనేజర్‌ డాక్టర్‌ వి.శ్వేత సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, మహిళా సాధికారత సెల్‌ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మల్లం నవీన్‌ అధ్యక్షతన శుక్రవారం హెల్త్‌ అవేర్నెస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె డయాగ్నోస్టిక్స్‌ హబ్‌లో అందుబాటులో ఉన్న వివిధ టెస్టులు, స్కానింగ్‌ సదుపాయాల గురించి వివరించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ ఎ.శ్రీనాథ్‌, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు ఐ.శివనాగ శ్రీను, కళా శాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి బి.రమేష్‌, మహిళా సాధికారత సెల్‌ కోఆర్డినేటర్‌ టి.సుమతి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ ఎం.నరేందర్‌, టి.రమేశ్‌, ఎల్‌.సత్యనారాయణ, బి.విష్ణుకుమార్‌, జి.ప్రసూన, ఎం.సమ్మయ్య, ఎం.శైలజ, పి.త్యాగయ్య, ఆర్‌.కుమారస్వామి, ఏఓ ఎన్‌. స్వరూపారాణి, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎంహెచ్‌డీ రాష్ట్ర

అధ్యక్షుడిగా ప్రదీప్‌

గీసుకొండ : మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడిగా గ్రేటర్‌ వరంగల్‌ నగరం 15వ డివిజన్‌ మొగిలిచర్లకు చెందిన గనిపాక ప్రదీప్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఎంహెచ్‌డీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ క్యాదరి భాస్కర్‌ పేరుతో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత కాలం ప్రదీప్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.

అప్రమత్తతతోనే

ప్రమాదాల నివారణ

సంగెం: విద్యుత్‌ వినియోగదారులు, సిబ్బంది అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ టెక్నికల్‌ ఎ.ఆనందం అన్నారు. విద్యుత్‌ భద్రతా వారోత్సవాల్లో భాగంగా కాపులకనిపర్తి, సంగెం, మచ్చాపూర్‌ సెక్షన్ల సిబ్బంది, వినియోగదారులకు ‘విద్యుత్‌ భద్రత– పొదుపు’పై మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో వానలు, ఈదురు గాలులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీగలు తెగిపోవడం, సాగడం, స్తంభాలు విరగడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయని తెలిపారు. వ్యవసాయబావుల వద్ద రైతులు విద్యుత్‌ సిబ్బందికి తెలియకుండా ట్రాన్స్‌ఫార్మర్లు బంద్‌ చేయడం, ఫ్యూజులు వేసుకోవడం, స్తంభాలు ఎక్కడం వంటి పనులు చేయవద్దన్నారు. ఇంటిలో హౌస్‌వైరింగ్‌కు దగ్గరలో జీఐ వైరును దండెంగా వాడొద్దని సూచించారు. ఎవరికైనా విద్యుత్‌ షాక్‌ తగిలితే రక్షించేందుకు చేతులతో తాకవద్దని, విద్యుత్‌ ప్రసరించని వస్తువులతో మాత్రమే రక్షించాలన్నారు. అవసరం లేనప్పుడు వాడకుండా విద్యుత్‌ను పొదుపు చేయాలని సూచించారు. విద్యుత్‌ షాక్‌ తగిలి స్పృహ కోల్పోయిన వ్యక్తిని సీపీఆర్‌ ద్వారా బతికించవచ్చని వివరించారు. కార్యక్రమంలో వరంగల్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ బి.భిక్షపతి, ఏడీఈ నర్సింహారావు, ఏఈలు తిరుపతిరెడ్డి, మధుసూదన్‌, సంపత్‌రెడ్డి, సబ్‌ఇంజనీర్లు తాజుద్దీన్‌, విక్రమ్‌, క్రాంతి, సురేష్‌, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఉరేసుకుని

వ్యాపారి ఆత్మహత్య

నర్సంపేట రూరల్‌ : ఉరేసుకుని వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేటలో శుక్రవారం జరిగిందని ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మార్త సురేశ్‌ (45) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ముంబాయికి చెందిన ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో సురేశ్‌ భార్యకు అప్పు ఉంది. నిత్యం ఫోన్‌ చేస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
1/1

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement