అటకెక్కికిన ‘బృహత్‌’ | Sakshi
Sakshi News home page

అటకెక్కికిన ‘బృహత్‌’

Published Thu, Apr 18 2024 10:35 AM

ధారూర్‌ మండలం కుక్కింద గ్రామంలోని పల్లె ప్రకృతి వనం - Sakshi

వికారాబాద్‌: బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు అటకెక్కినట్లు కన్పిస్తోంది. ఏడాది క్రితమే స్థలాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు వాటి ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించినప్పటికీ అవి ముందుకు సాగడంలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాలు, అర్బన్‌ పార్కుల పేరుతో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమానికి తోడు మండలానికొకటి చొప్పున బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంవీటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏడాది క్రితమే స్థలాల పరిశీలన పూర్తిచేసినప్పటికీ యంత్రాంగం వీటి ఏర్పాటుపై ఆసక్తి చూపడం లేదని సమాచారం.

సమన్వయలోపం...

బృహత్‌ పల్లె ప్రకృతి వనాల స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ యంత్రాంగం చూడగా.. ప్రకృతి వనాల అభివృద్ధి బాధ్యతలు మండల పరిషత్‌, ఉపాధి హామీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏ మొక్కలు నాటాలి, ఎన్ని నాటాలి తదితర వాటిని ఫారెస్టు అధికారులు పర్యవేక్షిస్తారు. పచ్చదనాన్ని పెంచటంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా వనాల్లో కుర్చీలు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మొదటి ఏడాది మొక్కలు నాటడం..వాటి పెంపకం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని, రెండవ ఏడాది నుంచి వనాలను అభివృద్ధి చేయటం, వాటిలో వసతులు కల్పించటం లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే శాఖల మధ్య సమన్వయలోపంతోనే ఇప్పటికీ పనులు ప్రారంభం కావడంలేదనే విమర్శలున్నాయి.

మండలానికొకటి చొప్పున..

జిల్లాలో మండలానికొకటి చొప్పున మొత్తం 19 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలాల లభ్యతను బట్టి మండల కేంద్రాలకు సమీపంలో లేదంటే మండలంలో ఏదో ఒకచోట ఈ వనాలకు స్థలాలను కేటాయిస్తారు. ఒక్కో బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని 8 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వనంలో సగటున 33వేల చొప్పున మొక్కలు నాటనున్నారు. కాగా ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీకి ఒకటి చొప్పున జిల్లాలో నాలుగు అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అలాగే గ్రామానికొకటి చొప్పున జిల్లాలో మొత్తం 715 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను కూడా త్వరగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో 19 బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రణాళిక

ఏడాది క్రితమే స్థలాల కేటాయింపు పూర్తి

శాఖల మధ్య సమన్వయ లోపంతో పనుల్లో తీవ్ర జాప్యం

అందుబాటులోకి తేవాలంటున్న ప్రజలు

పనులు ప్రారంభించాలి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాల స్థలాలు సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి. పల్లె ప్రకృతి వనాల తరహాలోనే బృహత్‌ ప్రకృతి వనాలు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.

– విజయ్‌ కుమార్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌

1/1

Advertisement
Advertisement