ముగ్గురూ ఆడపిల్లలైనా.. | Sakshi
Sakshi News home page

ముగ్గురూ ఆడపిల్లలైనా..

Published Fri, May 17 2024 5:00 AM

ముగ్గురూ ఆడపిల్లలైనా..

‘నీలకంఠా.. నిన్ను సేవించుకోవడానికి

వస్తే నట్టేట ముంచేశావు కదయ్యా..

నీకు దీపం పెడదామని వస్తే

మా ఇంటి దీపాలు ఆర్పేశావు కదయ్యా..

నీకిది న్యాయమా..’ అంటూ ఆ తల్లి

గుండెలు పగిలేలా రోదించిన తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న

ముగ్గురు కుమార్తెలు జలకంఠేశ్వర స్వామికి దీపారాధన కోసం వెళ్లి చెరువులో పడి మృతిచెందడం ఘటన స్థానికంగా కలకలం రేపింది. బిడ్డలను కాపాడేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం వృథా అయింది. బిడ్డలు కళ్లముందే మునిగిపోవడంతో ఆ తల్లి కడుపుకోతతో తల్లడిల్లిపోయింది. ఈ ఘటన ఎస్బీఆర్‌పురంలో తీవ్ర విషాదం నింపింది.

పుత్తూరు: జలకంఠేశ్వరస్వామికి పూజలు చేసి, చెరువులో దీపాలు పెట్టేందుకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన వడమాలపేట మండలం ఎస్బీఆర్‌ పురంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే, ఎస్బీఆర్‌పురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ పి.బాబు, విజయ దంపతులకు రూపిక(10), చరిత(13), యుషిక(17) ముగ్గురు కుమార్తెలు. ఆ దంపతులిద్దరూ శివభక్తులు. ఈ క్రమంలో నీలకంఠుడ్ని సేవించడానికి తిరుణామళ్లై వెళ్లాడు. విజయ తన ముగ్గురు కుమార్తెలతో గురువారం మధ్యాహ్నం గూళూరు చెరువు కట్టపైన ఉన్న శివుని గుడికి వచ్చి పూజలు చేసింది. పూజల అనంతరం ముగ్గురు కుమార్తెల చేతికి దీపాలు వెలిగించి ఇచ్చి చెరువులో వదలమని చెప్పింది. చెరువు మెట్లపై పాచి పట్టివుండడంతో కాలు జారి ఒకరి వెనక మరొకరు చెరువులోకి పడిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన విజయ కేకలు వేస్తూ పిల్లలను రక్షించేందుకు చెరువులోకి దిగేసింది. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలు మునిగిపోయారు. చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి విజయను మాత్రం రక్షించగలిగారు. మునిగిపోయిన పిల్లలను వెలికి తీసి పుత్తూరు ఆస్పత్రికి ఆటోలో తరలించారు. వైద్యులు పరీక్షించి ముగ్గురూ అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ మేరకు వడమాలపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆగని కన్నీటి సుడులు

నీకు దీపాలు తెస్తే.. మా ఇంటి దీపాలు ఆర్పేశావు

మేమేమి పాపం చేశాం? ఇంత శిక్ష ఎందుకేశావు శివా అంటూ ఆ తల్లి రోదనలతో పుత్తూరు ఆస్పత్రి మార్మోగి పోయింది. నిన్నే నమ్మితే నీట ముంచావు కదయ్యా.. నీ కోసం దీపాలు తెస్తే.. మా ఇంటి దీపాలనే ఆర్పేశావు కదయ్యా... నన్ను తీసుకొనిపోయి, నా బిడ్డల్ని వదిలేసి ఉంటే ఏమయ్యా.. అంటూ ఆ తల్లి విలపించిన తీరు స్థానికులను కలచివేసింది.

ఆర్‌ఎంపీ డాక్టర్‌గా గ్రామస్తులకు వైద్య సేవలందిస్తూ, వైఎస్సార్‌ సీపీ నాయకుడిగా ప్రజా సేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న బాబుకు ముగ్గురూ కుమార్తెలే. అయినా వారికి ఏ మాత్రం తక్కువ చేయకుండా ఎంతో సంతోషంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ముగ్గురినీ పెద్ద చదువులు చదివించి, పెళ్లిళ్లు చేసి పంపాలని ఆశించారు. ఈ క్రమంలో చిన్న కుమార్తె రూపిక 5వ తరగతి, రెండవ కుమార్తె చరిత 9వ తరగతి చదువుతుండగా, పెద్ద కుమార్తె యుషిక ఈ సారి ఇంటర్మీడియెట్‌లో 900కు పైగా మార్కులు సాధించింది. బీటెక్‌ చదివించాలని కాలేజి అన్వేషణలో ఉండగా ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని చిదిమేసింది. శివ భక్తులైన ఆ దంపతులు, శివుని సేవలోనే సర్వం కోల్పోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement