దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ సస్పెన్షన్‌

Published Sat, May 4 2024 6:35 AM

దేవదా

అరసవల్లి: జిల్లా దేవదాయ శాఖకు చెందిన నరసన్నపేట గ్రూప్‌ టెంపుల్స్‌ ఈఓగా పనిచేస్తున్న శ్రీకాకుళం డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటరమణను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసన్నపేట గ్రూప్‌ టెంపుల్స్‌లో భాగంగా ఉన్న శ్రీకాకుళం మండలం సింగుపురం కొండపై ఉన్న శ్రీ హటకేశ్వర స్వామి వారి ఆలయంలో గత నెల 24న జరిగిన జాతర మహోత్సవం అనంతరం హుండీ కానుకల లెక్కింపును అనధికారికంగా చేపట్టడంతో పాటు నిబంధనలను పాటించకపోవడంపై ఈఓ వెంకటరమణపై ఉన్నతాధికారులు పైచర్యలకు ఉపక్రమించారు. ఆలయ హుండీ లెక్కింపునకు సంబంధించి జిల్లా దేవదాయ శాఖాధికారి కార్యాలయానికి ఇతర నిర్వహణ శాఖలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే హుండీలను తెరిపించారన్న విషయం జిల్లా అధికా రుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణ అనంతరం శ్రీకాకుళం డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటరమణను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ డిప్యూటీ కమిషనర్‌ సుజాత ఉత్తర్వులను జారీ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌స్పెక్టర్‌గా రవికుమార్‌కు బాధ్యతలను అప్పగించారు.

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 5 నుంచి 18 ఏళ్ల లోపు గల బాలల నుంచి కేంద్ర ప్రభుత్వ సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కారాలను ప్రదానం చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఏపీఎస్సీపిసీఆర్‌) సభ్యుడు గొండు సీతారాం శుక్రవారం తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యంతో పాటు వివిధ వాటిలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన, దేశానికి చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల బాలలు జూలై 31వ తేదీ లోపు హెచ్‌టీటీపీఎస్‌ డాట్‌ అవర్డ్స్‌డాట్‌ జీఓవీడాట్‌ ఇన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా పంపించాలని సీతారాం సూచించారు.

‘హింసకి తావులేని ఎన్నికలే లక్ష్యం’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీ పోలింగ్‌ జరగకుండా ఉండేలా పని చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని భారత ఎన్నికల కమిషన్‌, సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితేష్‌ వ్యాస్‌ అన్నారు. ఆయన శుక్రవారం జిల్లాల ఎన్నికల అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నితేష్‌ మాట్లాడుతూ రీ పోల్‌కు తావు లేకుండా పారదర్శక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా అందరూ కృషి చేయాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల శిక్షణ కీలకమని, వారికి ఈవీఎం వాడకంపై పూర్తి అవగాహన ఉండాలని, వారు పోలింగ్‌ ప్రక్రియలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అనే అంశాలు స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్‌ ప్రక్రియలో లోపం ద్వారా రీపో ల్‌కు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. ఈవీఎం వినియోగం, రీప్లేస్మెంట్‌ కు ఒక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ఉందని ఆ మేరకు మాత్రమే చర్యలు ఉండాలని తెలిపారు.

జిల్లా నుంచి సాధారణ పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నా మని తెలిపారు. పోలీస్‌ అబ్జర్వర్‌ దిగంబర్‌ పి.ప్రధాన్‌ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటయ్యాయని, వాటిని తాను స్వయంగా పరిశీలించానని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలాని సమూన్‌, ఎస్పీ జీఆర్‌ రాధిక మాట్లాడుతూ అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టుల ఏర్పాటు, అంతర్‌ జిల్లాల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు సీజర్‌ అంశాలు, ఎన్నికల వ్యయ పరిశీలన జిల్లాలో పక్కాగా ఉన్నాయని, జిల్లాలో సు మారు రూ. 4 కోట్ల వరకు సీజ్‌ చేశారని తెలిపారు. ఇప్పటికే రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి తదుపరి ఓటరు ఇన్ఫర్మేషన్‌ స్లిప్పులు బీఎల్వోల ద్వారా సంబంధిత ఓటరుకు పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు.

దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ సస్పెన్షన్‌
1/1

దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ సస్పెన్షన్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement