చైనాతో భారత్‌ ‘ఢీ’ | Sakshi
Sakshi News home page

చైనాతో భారత్‌ ‘ఢీ’

Published Thu, May 2 2024 3:57 AM

A tough opponent for Team India in the quarter finals

క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియాకు క్లిష్టమైన ప్రత్యర్థి

చివరి మ్యాచ్‌లో ఇండోనేసియా చేతిలో ఓడిన భారత్‌ 

 చెంగ్డూ (చైనా): ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు సెమీఫైనల్‌ బెర్త్‌ కోసం 10 సార్లు చాంపియన్‌ చైనాతో క్వార్టర్‌ ఫైనల్లో తలపడనుంది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–4తో 14 సార్లు చాంపియన్‌ ఇండోనేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ ప్రణయ్‌ 61 నిమిషాల్లో 13–21, 21–12, 21–12తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్‌ను ఓడించాడు.

 రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 77 నిమిషాల్లో 22–24, 24–22, 19–21తో షోహిబుల్‌ ఫిక్రి–మౌలానా బగస్‌ జంట చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 65 నిమిషాల్లో 18–21, 21–16, 17–21తో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీ చేతిలో ఓటమి పాలయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్‌ కపిల–సాయిప్రతీక్‌ జోడీ 20–22, 11–21తో లియో కార్నాండో–డేనియల్‌ మార్టిన్‌ జంట చేతిలో పరాజయం పాలైంది.

 చివరిదైన ఐదో మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–19, 22–24, 14–21తో ద్వి వర్దాయో చేతిలో ఓడిపోయాడు. గ్రూప్‌ ‘సి’లో ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్‌ ల్లోనూ నెగ్గి అగ్రస్థానంలో నిలువగా... భారత్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనాతో భారత్‌; మలేసియాతో జపాన్‌; కొరియాతో ఇండోనేసియా; చైనీస్‌ తైపీతో డెన్మార్క్‌ తలపడతాయి. మరోవైపు మహిళల టీమ్‌ టోర్నీ ఉబెర్‌ కప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో నేడు జపాన్‌తో భారత్‌; డెన్మార్క్‌తో చైనా... శుక్రవారం ఇండోనేసియాతో థాయ్‌లాండ్‌; చైనీస్‌ తైపీతో కొరియా పోటీపడతాయి.

Advertisement
Advertisement