పర్యవేక్షకులు లేక పరేషాన్‌ | Sakshi
Sakshi News home page

పర్యవేక్షకులు లేక పరేషాన్‌

Published Sat, May 4 2024 7:00 AM

-

● ప్రసాదాల విభాగంలో ఇబ్బందులు ● సిబ్బంది కొరతతో అధికారులకు తలనొప్పి

వేములవాడ: ఎములాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు అధిక శాతం స్వామి వారి ప్రసాదాలను కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తారు. అయితే ప్రసాదాల తయారీ, ప్రసాదాలకు కావాల్సిన సరుకులిల్చే గోదాంలలో పని చేసే పర్యవేక్షకులు లేకపోవడంతో పనులు ముందుకు సాగక మిగతా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. రద్దీకి తగినట్లుగా ప్రసాదాల తయారీ, గోదాంలలో పనులు పర్యవేక్షించే వారు లేకపోడవంతో పైస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. గోదాంలో పనిచేసే పర్యవేక్షకులు డిప్యూటేషన్‌పై ఎమ్మెల్యే పీఎస్‌గా వెళ్లారు. ప్రసాదాల తయారీ విభాగంలో విధులు నిర్వహించే పర్యవేక్షకులు ఇటీవలే రిటైర్డ్‌మెంట్‌ పొందారు. దీంతో ఆలయానికి అత్యంత కీలకమైన రెండు విభాగాల్లో పర్యవేక్షుకులు లేకపోడవంతో పనుల పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. సిబ్బంది కొరత, రిటైర్డ్‌మెంట్‌ పొందిన వారి స్థానాల్లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో ఉన్నతాధికారులు పనులు చేయిస్తున్న క్రమంలో పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవాదాయశాఖ అధికారులు సిబ్బంది కొరతపై ప్రత్యేక దృష్టిసారించి సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement