చంద్రబాబూ.. మానవత్వం ఉందా..? | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. మానవత్వం ఉందా..?

Published Sat, May 4 2024 10:30 AM

చంద్రబాబూ.. మానవత్వం ఉందా..?

ఒంగోలు రూరల్‌: టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం లేదని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అందువలనే వలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించే ప్రక్రియను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. తన మనుషులతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించి మరీ వలంటీర్లతో పింఛన్ల పంపిణీని అడ్డుకోవడం దారుణమన్నారు. వృద్ధుల ఉసురుపోసుకుంటున్నాడని, ఈ పాపం ఊరికే పోదని బాలినేని శాపనార్థాలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు మండలంలోని యరజర్ల, దేవరంపాడు, బొద్దులూరివారిపాలెం, వలేటివారిపాలెం గ్రామాల్లో శుక్రవారం బాలినేని రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్నారు. పేదల కోసం సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ సేవలన్నింటినీ ఇంటి వద్దకే అందిస్తున్నారని వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకూ పెద్ద పీట వేస్తూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఇవన్నీ ఇలాగే కొనసాగాలంటే మళ్లీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఒంగోలు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైఎస్సార్‌ సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యరజర్లలో బాలినేని మాట్లాడుతూ గ్రామంలో సచివాలయ భవనం, రైతు భరోసా భవనం, వెల్నెస్‌ సెంటర్‌ భవనాన్ని నిర్మించి స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డివిజన్‌లోనే వేగంగా యరజర్లలో అన్ని భవన నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, అభివృద్ధి పనులు సైతం పూర్తి చేశామన్నారు. ఇంకా పూర్తి కావాల్సిన పనుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్ల జనరంజక పాలన గురించి ప్రజలకు వివరించారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించడం, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల నగదు బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఒంగోలులో ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని బాలినేని వివరించారు. టీడీపీ నాయకులు ఎన్నో కుట్రలకు పాల్పడినప్పటికీ నిరుపేదలకు 25 వేల ఇళ్ల పట్టాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ఇంకా ఇళ్ల స్థలాలు రాని నిరుపేదలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, వారికి కూడా పట్టాలు ఇస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యరజర్లలో బాలినేని రోడ్‌ షోలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి, పొగాకు బోర్డు ఉత్పత్తిదారుల చైర్మన్‌ వాకా బసివిరెడ్డి, ఒంగోలు ఎంపీపీ పి.మల్లికార్జునరెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ సోమశేఖర్‌, యరజర్ల సర్పంచ్‌ తమ్మిశెట్టి రాములమ్మ, శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ జాజుల శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ పందిర్ల రాధా అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉలిచిలో సాయంత్రం బాలినేని శ్రీనివాసరెడ్డికి ఘనస్వాగతం లభించింది. పార్టీ మండల అధ్యక్షుడు చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షోలో బాలినేని మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలు అందజేశామన్నారు. సచివాలయ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, నాయకుడు ఆదిశేషయ్య కరవది ఎంపీటీసీ శ్రీనివాసరావు, సర్పంచ్‌ మురళి, పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. బొద్దులూరిపాలెంలో సర్పంచ్‌ కవిత, దేవరంపాడులో సర్పంచ్‌ మహాలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ నాయకులు సోము, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూటి ప్రశ్న

వలంటీర్లతో పింఛన్ల పంపిణీ ఆపించి వృద్ధుల ఉసురుపోసుకుంటున్నావంటూ మండిపాటు

సీఎం జగన్‌ పేదల పక్షపాతి అని కితాబు

Advertisement
Advertisement