ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు | Sakshi
Sakshi News home page

ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు

Published Sat, May 4 2024 7:25 AM

ఉద్యమ

పాలకుర్తి(రామగుండం): సుమారు 42ఏళ్ల క్రితం అడవి బాటపట్టిన మావోయిస్ట్‌ నేత, ఉద్యమ కెరటం చీమల నర్సయ్య ఉరఫ్‌ జోగన్న జీవిత ప్రస్థానం ముగిసింది. నాలుగురోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసిన జోగన్నకు శుక్రవారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య అంతక్రియలు జరిపారు. ‘పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చీమల నర్సన్న అమర్‌ రహే’ అంటూ చేసిన నినాదాలతో జయ్యారం మార్మోగింది. ఉదయం 8.30గంటలకు ప్రత్యేక వాహనంలో నర్సయ్య మృతదేహాన్ని గుడిపల్లి శివారులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో స్థానికుల సందర్శనార్థం ఉంచారు. చిన్నప్పుడే పెత్తందార్లు, పోలీస్‌పటేళ్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టిన జోగన్న.. కడదాకా ఉద్యమంలోనే ఉండి పీడిత ప్రజల పక్షాన పోరాటం చేశారని బంధుమిత్రులు, వివిధ ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల నేతలు, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు, మాజీ మావోయిస్టులు, స్థానికులు గుర్తుచేసుకున్నారు. నర్సయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. దాదాపు రెండు గంటల పాటు జోగన్నతో ఉద్యమ సమయంలో పంచుకున్న అనుభవాలు స్మరించుకున్నారు. ఉద్యమ చైతన్య గేయాలు ఆలపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఉదయం 11గంటల సమయంలో వైకుంఠరథంపై జోగన్న పార్థివదేహాన్ని ఉంచి డప్పుచప్పుళ్ల మధ్య అంతిమయాత్ర ప్రారంభించారు. జయ్యారం గ్రామ శివారులోని శ్మశానవాటికలో నర్సయ్య దహన సంస్కారాలు పూర్తిచేశారు. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, ప్రతినిధులు శాంతక్క, భవాని, అంజమ్మ, సత్య, ఉష, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామి, మహ్మద్‌ హుస్సేన్‌, శ్రీపతి రాజగోపాల్‌, విరసం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ బాలసాని రాజయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ గుమ్మడి కుమారస్వామి, నాయకులు పోరెడ్డి వెంకన్న, నారా వినోద్‌, బొడ్డుపల్లి వినోద్‌, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ముడిమడుగుల మల్లయ్య, ఎరుకల రాజయ్య, లక్ష్మణ్‌, పర్వతాలు, పుట్నూర్‌ ఎంపీటీసీ గంగాధర రమేశ్‌, నాయకులు కొప్పు రాజేశం, చింతకింది సత్యనారాయణ, ప్రభాకర్‌తో పాటు సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

పుట్టిన ఊరులో కన్నా అడవిలోనే ఎక్కువ..

మావోయిస్టు నేత చీమల నర్సయ్య తాను పుట్టిన ఊరులో కన్నా.. అడవిలోనే ఎక్కువకాలం జీవించారు. తన 22ఏళ్ల వయసులోనే వనం బాట పట్టిన నర్సయ్య.. దాదాపు 42ఏళ్ల పాటు ఉద్యమంలో గడిపారని, కనీసం సొంత ఇంటిని కూడా నిర్మించుకోని నిస్వార్థ ఉద్యమ నేత అని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘అవ్వ చచ్చిపోతే రాకపోతివి.. చెల్లి చచ్చిపోతే రాకపోతివి.. అడవిలోనే అసువులు బాసి తివా తమ్ముడా.. మా ఇంటికి వచ్చినా.. నీ మేనల్లుడు నిన్ను సాదేటోడు కదా.. ఓ తమ్ముడా’ అని నర్సయ్య సోదరి రాజక్క రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

స్వగ్రామంలో నర్సయ్య అంత్యక్రియలు పూర్తి

రోదించిన సోదరి రాజక్క, కుటుంబసభ్యులు

ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు
1/1

ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు

Advertisement
Advertisement