మద్యం పాలసీ కేసు.. మనీష్‌ సిసోడియాకు ఊరట | Sakshi
Sakshi News home page

మద్యం పాలసీ కేసు.. మనీష్‌ సిసోడియాకు ఊరట

Published Fri, May 3 2024 4:37 PM

Delhi High Court Seeks Investigating Agencies Response To Manish Sisodia Bail Plea

మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు  ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం..  సిసోడియా తన భార్యను వారానికి ఒకసారి కస్టడీలో కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది.

సిసోడియా బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ప్రతి స్పందనలు కోరింది. విచారణను మే 8కి వాయిదా వేసింది.

ఇప్పటికే మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ బెయిల్‌ పిటిషన్‌ను ఏప్రిల్‌ 30న రౌస్‌ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.

ఈ కేసుకులో సీబీఐ, ఈడీలకు ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కావేరీ బవేజా.. మద్యం పాలసీ కేసు విచారణ సమయంలో బెయిల్‌ ఇవ్వడం సరైందని కాదని, సిసోడియాకు బెయిల్‌ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు.  

అయితే ఏప్రిల్ 30 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ, మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు గురువారం బెయిల్ కోరుతూ అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

మనీష్ సిసోడియా మధ్యంతర దరఖాస్తులో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాను వారానికి ఒకసారి చూసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టును కోరారు.

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్‌ అరోరాలతో కూడిన ధర్మాసనం సిసోడియా పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగిస్తే దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. 

Advertisement
Advertisement