నాడు మోదీకి వంట వండిన దీపక్‌.. ఇప్పుడేం చేస్తున్నారు? |Deepak Resident Of Nepal Once Used To Cook Food For Modi, Details Inside | Sakshi
Sakshi News home page

నాడు మోదీకి వంట వండిన దీపక్‌.. ఇప్పుడేం చేస్తున్నారు?

Published Sat, May 4 2024 11:34 AM

Deepak Resident of Nepal Once Used to Cook Food for Modi

అది 1995.. దేశంలోని హర్యానాలో చౌదరి బన్సీలాల్ ప్రభుత్వం  అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని హర్యానా రాష్ట్ర ఇంచార్జిగా నియమించింది. మోదీకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, పార్టీ అతనికి హర్యానా బాధ్యతలను అప్పగించింది. నాటి రోజుల్లో పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ సమావేశాలు అద్దె భవనంలో జరిగేవి.

నరేంద్ర మోదీ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అతని చూపు అక్కడున్న దీపక్ అనే 12 ఏళ్ల బాలునిపై పడింది. ఆ కుర్రాడు సంఘ్ కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, బీజేపీ కార్యాలయంలో వంటమనిషిగా కూడా పనిచేసేవాడు. మోదీ ఆ కుర్రాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు రోహ్‌తక్ లో జరిగే బీజేపీ సమావేశానికి తనతో పాటు దీపక్‌ను కారులో తీసుకెళ్లారు.

నాటి అనుభవాల గురించి దీపక్‌ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు రోహ్‌తక్‌ నుంచి తిరిగి వస్తుండగా కిలా రోడ్డులో కారు ఆపిన మోదీ తనకు డబ్బులు ఇచ్చి , ఒక షార్ట్, టీ షర్ట్ కొనుక్కోమని చెప్పారు. తరువాత వాటిని వేసుకుని చూపించమన్నారు. కొద్దిసేపటి తరువాత కిచిడీ ఎలా చేయాలో చూపించారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు నేర్పించారు.

ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నేను తయారుచేసిన కిచిడీని తినేవాడు. నేను అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. చదువు మానవద్దని చెబుతూ, నా స్కూలు ఫీజు కట్టేవారు. నన్ను చదువుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మోదీ  ఆరేళ్లపాటు హర్యానా బీజేపీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆ తర్వాత  గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.

2002లో మోదీ.. దీపక్‌కు ఫోన్‌ చేశారు. అలాగే  2004, 2006లో కూడా దీపక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 2009లో మోదీ హిస్సార్‌లో జరగబోయే ర్యాలీకి వెళ్తుండగా హెలికాప్టర్‌ చెడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దీపక్‌.. మోదీని కలుసుకున్నారు. 2014,  2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ.. దీపక్‌ను వేదికపైకి పిలిచి ప్రశంసించారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్న పీఎంవో కార్యాలయ బృందం దీపక్‌ను ఇంటర్వ్యూ చేసింది. దీపక్ ఆచార్య నేపాల్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు.

Advertisement
Advertisement