మహిళలే నిరే్ణతలు | Sakshi
Sakshi News home page

మహిళలే నిరే్ణతలు

Published Sat, May 4 2024 12:25 AM

మహిళలే నిరే్ణతలు

రెండు లోక్‌సభ స్థానాల్లో మగువల ఓట్లే అధికం

మహబూబ్‌నగర్‌ డెస్క్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 50.53 శాతంతో 8,50,172 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 17,916 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానంలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో కూడా 50.24 శాతంతో 8,73,340 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 8,465 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలోని కొల్లాపూర్‌, కల్వకుర్తి సెగ్మెంట్ల పరిధిలో మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 12 సెగ్మెంట్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది.

ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రత్యేక దృష్టి

ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ గత శాసనసభ ఎన్నికల మాదిరిగానే ఓటింగ్‌లో మహిళలు అధికంగా పాల్గొంటే పోలింగ్‌ శాతం భారీగా పెరుగుతుంది. దీంతో అభ్యర్థుల గెలుపోటమును వీరే ప్రభావితం చేయనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయా పార్టీల నేతలను ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీనితో పాటు మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి నెల రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. తదితర వాటిని కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ ఆత్మ నిర్భన్‌నారీ శక్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. సుకన్య సమృద్ధి యోజన, ముద్ర యోజన, లఖ్‌పతి దీదీ, స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా, మిషన్‌ శక్తి యోజన.. తదితర కార్యక్రమాలను మహిళలకు వివరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి మహిళా మోర్చా కార్యకర్తలు వీటిపై ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సైతం... పదేళ్లలో మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, పింఛన్లు, కేసీఆర్‌ కిట్లు అందించిన విషయాన్ని గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

మహబూబ్‌నగర్‌లో 50.53,నాగర్‌కర్నూల్‌లో 50.24శాతం మహిళా ఓటర్లు

అభ్యర్థుల జాతకాలు తేల్చేది వీరే..

వారిని ప్రసన్నం చేసుకోవడానికిప్రయత్నిస్తున్న నేతలు

Advertisement
Advertisement