కాయ్‌.. రాజా.. కాయ్‌...! | Sakshi
Sakshi News home page

కాయ్‌.. రాజా.. కాయ్‌...!

Published Fri, May 17 2024 7:05 AM

కాయ్‌.. రాజా.. కాయ్‌...!

పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొన సాగించారు. ముఖ్యంగా యువత కోసం ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. మహిళలకు పలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పేద వర్గాల ప్రజల కోసం ఇంత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే వారికి మేలు చేకూర్చింది. పోలింగ్‌ తీరును పరిశీలిస్తే ..మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ఈ ఓటు బ్యాంకు అంతా వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బస్సుల్లో, ఆటోల్లో, సెలూన్లలో, హోటళ్లలో.. ఇలా ప్రతి చోటా పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా ఏ నలుగురు గుమికూడినా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపోటములపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతోంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అభ్యర్థులకు వచ్చే మెజార్టీలు.. తదితర అంశాలపై తమకు తెలిసింది, అక్కడక్కడ విన్నది చెబుతున్నారు. పోలింగ్‌ జరిగిన తీరును బేరీజు వేసుకుంటూ పలువురు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. స్థాయిని బట్టి రూ. వేల నుంచి రూ. కోట్లలో బెట్టింగ్‌ కడుతున్నారు.

సాక్షి, నంద్యాల/ఆళ్లగడ్డ: సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన పోలింగ్‌ ఘట్టం ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. దీంతో గెలుపోటములు, మెజార్టీలపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ధపా పోలింగ్‌ శాతం పెరిగింది. ఓటర్లు పోలింగ్‌ ప్రారంభానికి ముందుగానే క్యూలైన్లలో బారులుతీరి నిలబడి ఓర్పుతో ఓటెయ్యడం.. అందులో మహిళలు, వృద్ధులు ఉండటం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనే దానిపై అంచనాలు వేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు గ్రామ, మండలాల వారీగా కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. సామాజిక వర్గాలు, గ్రూపులు, వర్గాల వారీగా కూడా అంచనాలు వేసుకుంటూ ఎవరికివారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఫలితాలకు సమయం ఉండడంతో ప్రస్తుతం బెట్టింగ్‌ రాయుళ్ల హవా నడుస్తోంది.

స్థాయిని, మెజారిటీని బట్టి రేట్లు

రాజకీయాలపై ఆసక్తి ఉన్న కొందరు ‘మీ నియోజకవర్గంలో ఎలా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది.. ఎంత మేర మెజార్టీ రావచ్చు’ అని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న బంధువులను, పరిచయస్తులకు ఫోన్లు చేసి మరీ తెలుసుకుంటున్నారు. కొందరు నాయకులు చేసిన అబివృద్ధి, అభ్యర్థుల వ్యక్తిత్వం, వ్యతిరేకత, పంపిణీ చేసిన నగదు తదితర అంశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. జిల్లాలో అభ్యర్థుల మెజారిటీలతో పాటు ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే ప్రధానంగా పందేలు నడుస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని జోరుగా పందేలు కాస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నా పందేలకు మాత్రం దూకుడుగా ముందుకు రావడం లేదని బెట్టింగ్‌ రాయుళ్లు చెబుతున్నారు. అసెంబ్లీకి ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది.. ఎంపీ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందన్న అంశాలే బెట్టింగ్‌ రాయుళ్లకు ప్రధానాంశాలుగా మారాయి. మెజారిటీ ఎక్కువగా వస్తుందని పందెం వేస్తే ఒకటికి మూడు, నాలుగు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారు.

రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలపైనా...

జిల్లాలో పందెం రాయుళ్ల హాట్‌ ఫేవరేట్‌గా పిఠాపురం నిలుస్తోంది. అక్కడ పోటీలో ఉన్న పవన్‌ కల్యాణ్‌, వంగా గీతలో ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై పందెం కాస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి పవన్‌కల్యాణ్‌ ఓడిపోవడంతో ఈ సారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారా? లేక అలవాటైన రీతిలో ఓడిపోతారా? అని ఆరా తీస్తున్నారు. మంగళగిరి, హిందూపురం, కుప్పం స్థానాలపైనా పందేలు నడుస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబుకు మెజార్టీ తగ్గుతుందని పందెం కాయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు పందెం రాయుళ్లు చెబుతున్నారు.

టీడీపీ వైపు ముందుకురాని

పందెంరాయుళ్లు

నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌ సీపీ గెలిచే స్థానాలపై పందెం కాసేందుకు టీడీపీ అభిమానులు ముందుకు రావడం లేదు. 2014లో ఒక్క బనగానపల్లె మినహా అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్‌ సీపీ గెలిచింది. 2019లో ఉమ్మడి జిల్లా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ ఐదేళ్లలో సంక్షేమం ఇంటి ముంగిటకే రావడంతో ప్రజలు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారు. తాజాగా జరిగిన పోలింగ్‌లోనూ ఇదే అంశం ప్రస్ఫుటమైనట్లు భావిస్తున్నారు. దీంతో మరోసారి వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అంచనాలు ఉండడంతో పందెం కాయడానికి టీడీపీ వారు ముందుకు రావడం లేదని పంటర్స్‌ చెబుతున్నారు.

మెజారిటీలపై..

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ గెలుపు గ్యారంటీ అని, గత ఎన్నికలతో పోలిస్తే కాస్త మెజారిటీ అటు ఇటుగా ఉంటుందని.. మెజారిటీలపై పందెం కాయడానికి సిద్ధమని టీడీపీ నుంచి ఆఫర్స్‌ వస్తున్నట్లు పంటర్స్‌ చెబుతుండడం గమనార్హం. అలాగే డోన్‌ నుంచి ఈ సారి మంత్రి బుగ్గన హ్యాట్రిక్‌ సాధిస్తారని ఎక్కువ మంది పందెం కాయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ, బనగానపల్లెలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల మెజారిటీలపై జోరుగా పందేలు కాస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇద్దరి మధ్య పందెం సెట్‌ చేసి పెద్ద మత్తంలో పంటర్స్‌ కమీషన్‌ తీసుకుంటున్నారు.

టీడీపీ నేతల మేకపోతు గాంభీర్యం

ఓటమి తప్పదని తెలిసినప్పటికీ టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటి దాక భారీ మెజార్టీతో గెలుస్తున్నామని ప్రచారం నిర్వహించుకున్నారు. నిన్నటి వరకు స్వల్ప మెజార్టీతో అయినా గెలుపు మాదే అంటున్నారు. తాజాగా వైఎస్సార్‌ సీపీకి గతంలో వచ్చిన అంత మెజార్టీ రాదు తక్కువ మెజార్టీతో బయట పడొచ్చు అని చర్చించుకుంటున్నారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో

ధైర్యం

జిల్లాలో జోరుగా సాగుతున్న పందేలు

పోలింగ్‌ ముగియడంతో

గెలుపోటములపై బెట్టింగ్‌లు

మరోసారి వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌

చేస్తుందంటున్న విశ్లేషకులు

ఇరు పార్టీల మధ్య పందెం సెట్‌ చేసి

కమీషన్‌ తీసుకుంటున్న మధ్యవర్తులు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement