మహిళా రక్షణ కోసమే షీటీమ్‌ బృందాలు | Sakshi
Sakshi News home page

మహిళా రక్షణ కోసమే షీటీమ్‌ బృందాలు

Published Sat, May 4 2024 6:40 AM

మహిళా రక్షణ కోసమే షీటీమ్‌ బృందాలు

ఫ ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ క్రైం: మహిళా రక్షణ కోసం షీటీమ్‌ బృందాలు నిరంతరం పనిచేస్తాయని జిల్లా ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్‌ నెలలో జిల్లా వ్యాప్తంగా 13 ఫిర్యాదులు రాగా వాటిని విచారించి ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు రద్దీ ఉండే బస్టాండ్‌లు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్ల, షాపింగ్‌ మాల్స్‌, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో మహిళలను వేధింపులకు గురి చేసే వారిపై రహస్యంగా నిఘా ఉంచినట్లు తెలిపారు. మహిళలు నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో షీటీమ్‌ పోలీసులకు, డయల్‌ 100, వాట్సప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ పద్ధతిలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఫొటోలు మార్పింగ్‌ చేసి యువతులకు పంపి బ్లాక్‌మెయిల్‌ చేస్తే షీటీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు నల్లగొండ షీటీమ్‌ నంబర్‌ 8712670235, ఎస్పీ 8712670200, షీటీమ్‌ సీఐ కరుణాకర్‌ 8712670143, మిర్యాలగూడ షీటీమ్‌ ఎస్‌ఐ కోటేష్‌ 8096004465 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఆడిట్‌ అభ్యంతరాలపై ఆధారాలు సమర్పించాలి

మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలంలో 2018–19 నుంచి 2023–24 వరకు నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో తెలిపిన ఆడిట్‌ అభ్యంతరాలపై మూడు, నాలుగు రోజుల్లో తగిన ఆధారాలు సమర్పించాలని జిల్లా విజిలెన్స్‌ అధికారి వేణుగోపాల్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్ణీత సమయంలోగా ఆధారాలు సమర్పించకుంటే ఫైనాన్షి యల్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ ఉన్న చోట రికవరీ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మేనేజర్‌ గౌతమి, టీఏ వింధ్యారాణి, ఎంపీడీఓ శేషగిరిశర్మ, ఎంపీఓ పద్మ పాల్గొన్నారు.

వైభవంగా ఊంజలి సేవ

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజలి పర్వం చేపట్టారు. అదే విధంగా ప్రధానాలయంలో అర్చనలు, అభిషేకం, సుదర్శనహోమం, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర కైంకర్యాలు నిర్వహించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement