అప్పుడే నకిలీ విత్తనాల దందా! | Sakshi
Sakshi News home page

అప్పుడే నకిలీ విత్తనాల దందా!

Published Sat, May 4 2024 6:40 AM

అప్పుడే నకిలీ విత్తనాల దందా!

నల్లగొండ అగ్రికల్చర్‌: జిల్లాలో అప్పుడే నకిలీ పత్తి విత్తనాల దందా ప్రారంభమైంది. జిల్లాలో వచ్చే వానాకాలం సీజన్‌లో 5.40లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయనున్నట్టు, ఇందుకు సుమారు 15లక్షల వరకు పత్తి ప్యాకెట్లు అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీజన్‌ ఆరంభానికి నెలరోజుల ముందునుంచే నకిలీ విత్తనాల దందాకు వ్యాపారులు తెరలేపారు. తక్కువ ధరలకు విత్తనాలు ఇస్తామంటూ అమాయక రైతులకు నాసిరకం పత్తి విత్తనాలను అంటగడుతున్నారనే సమాచారం.

పల్లెల్లో ఏజెంట్లను నియమించుకొని..

గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని దందాను మూడుపువ్వులు ఆరుగాయలుగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. గత వానాకాలంలో సైతం నాసిరకం పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టడంతో సరైన పూత,కాయ రాక దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్‌, నార్కట్‌పల్లి, చండూరు, మునుగోడు, దేవరకొండ, కొండమల్లేపల్లి, హాలియా, అంగడిపేట, చింతపల్లి, మాల్‌ వంటి ప్రాంతాల్లో నకిలీలు విత్తనాలు తీసుకొచ్చి గోదాముల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం సమీపంలోని కొన్ని దుకాణాలు, ప్రకాశం బజార్‌, దేవరకొండ రోడ్డులోని ఒక ఎరువుల దుకాణం, మండలాల్లోని వివిధ గ్రామాల్లో గల దుకాణాల్లోనూ ఈ దందాను జోరుగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వ్యాపారులు మాత్రం తమ వద్ద ఎరువులు, పురుగుల మందులను కొనుగోలు చేసే రైతులకు విత్తనాలను ముందస్తుగా ఉద్దెరకు అంటగడుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల కోడ్‌కు ముందే విత్తనాల రాక

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండి చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహిస్తున్నారు. కానీ, ఎన్నికల కోడ్‌ వెలువడక ముందే.. అంటే చెక్‌పోస్టులను ఏర్పాటు చేయకముందే నకిలీ విత్తనాలను జిల్లాకు చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారు 5లక్షల వరకు విత్తన ప్యాకెట్లు, 8టన్నుటల వరకు లూజ్‌ విత్తనాలను వ్యాపారులు తెచ్చినట్లు సమాచారం.

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం

నకిలీ పత్తి విత్తనాలను అమ్మకుండా దుకాణాలు, వ్యాపారులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. గతంలో నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడిన వారు తిరిగి రెండోసారి పట్టుబడితే పీడీ యాక్టు ప్రయోగిస్తాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను నిర్వహిస్తాం. నకిలీ విత్తనాల అమ్మేవారి సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– పాల్వాయి శ్రవణ్‌కుమార్‌, డీఏఓ, నల్లగొండ

ఫ ఏపీతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి పత్తి విత్తనాలు దిగుమతి

ఫ రహస్య ప్రాంతాల్లో నిల్వచేసిన వ్యాపారులు

ఫ ఏజెంట్ల ద్వారా గ్రామాలకు చేరవేసి రైతులకు విక్రయం

ఫ నామమాత్రంగా అధికారుల నిఘా

విత్తనాలు వచ్చింది ఈ జిల్లాల నుంచే..

ముఖ్యంగా మన రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, ఏపీ రాష్ట్రంలోని కర్నూల్‌, గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి ఈ నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున వ్యాపారులు తెస్తున్నారు. ప్రస్తుతం చెక్‌పోస్టులు ఉన్న కారణంగా కార్లు, బైక్‌లపై ప్రధాన రహదారుల నుంచి కాకుంగా గ్రామాల గుండా జిల్లాకు తీసుకొస్తున్నట్టు సమాచారం. జిల్లా వ్యవసాయశాఖ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున గుట్టుచప్పుడు కాకుండా ఇతర జిల్లాల నుంచి నకిలీ విత్తనాలను తెచ్చి రైతులకు అంటగడుతున్నారు. గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి నకిలీ విత్తనాల దందాను అరికట్టాలని, లేకుంటే తాము తీవ్ర నష్టాలపాలయ్యే అవకాశం ఉందని కొందరు రైతులు అంటున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement