ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

Published Sat, May 4 2024 4:45 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

ములుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వంద శాతం ప్రసవాలు జరిగేలా చూడాలని అడిషనల్‌ కలెక్టర్‌(స్థానిక సంస్థలు) శ్రీజ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రి, వెంకటాపురం(కె) కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీనెల పని తీరును, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే సేవలను మెరుగుపరచాలన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించకూడదన్నారు. క్లిష్టతరమైన గర్భిణుల జాబితా తయారు చేసుకుని వారి పట్ల సానుకూలంగా మెదలాలని, పక్కా ప్రణాళిక రూపొందించుకొని రవాణా సౌకర్యాల ఏర్పాట్లను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు సమన్వయంతో మెదలాలన్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రసవానికి చేరువలో ఉన్నవారి వివరాలను ప్రదర్శించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయాలని, మాతా శిశు సంరక్షణపై పర్యవేక్షణ చేయాలన్నారు.

క్షయ రహిత సమాజానికి కృషి చేయాలి

క్షయ రహిత సమాజాన్ని నిర్మించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీజ అన్నారు. కలెక్టరేట్‌లో క్షయవ్యాధిపై సమీక్ష చేశారు. తెలంగాణ డయాగ్రస్టిక్‌ హబ్‌ల ద్వారా రోగ నిర్ధారణ టెస్టులు చేపించాలన్నారు. వెంకటాపురం(కె) ఆస్పత్రి సమస్యలపై ఆరా తీశారు. ఏటూరునాగారం ఆస్పత్రిలో దంత, సీ్త్ర వైద్యం, పల్మనాలజీ, పిడియాట్రిక్ట్‌, ఫిజియోథెరఫీ, అనస్తీషియా వైద్య నిపుణుల సేవలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ప్రతీ రివ్యూ మీటింగ్‌కు వైద్యులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య, ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్‌, ఏటూరునాగారం సూపరింటెండెంట్‌ సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఏఎన్‌ఎంలు, ఆశలు సమన్వయంతో మెలగాలి

అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీజ

Advertisement
Advertisement