ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం | Sakshi
Sakshi News home page

ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

Published Sat, May 4 2024 4:45 AM

ఇసుక

మంగపేట: ఏజెన్సీ ప్రాంతం మంగపేట మండలంలోని ఇసుక క్వారీల్లో రైజింగ్‌ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సమాచార హక్కు చట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్‌ వాగబోయిన సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని గోదావరి ఇసుక క్వారీలకు అనుమతి పొందిన ఆదివాసీ గిరిజన సొసైటీలను చేజిక్కించుకుని బినామీలుగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న రైజింగ్‌ కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ స్పందించి కూలీలు, ట్రాక్టర్లతో కాకుండా యంత్రాలతో ఇసుకను తరలించిన రైజింగ్‌ కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అక్రమ మద్యం స్వాధీనం

ఏటూరునాగారం: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గుడుంబా, అక్రమ మద్యం నివారించేందుకు తనిఖీలు చేపట్టినట్లు ఎకై ్సజ్‌ సీఐ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం మంగపేట మండలం చుంచుపల్లి, మొట్లగూడెం, శనిగకుంట, నర్సింహసాగర్‌ గ్రామాల్లో ఎకై ్సజ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి ఇళ్ల నుంచి 20 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకొని వాసం కృష్ణ, డేరంగుల పద్మ, అన్నాల వెంకన్న, దాట్ల నర్సింగరావుపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యంను ఎకై ్సజ్‌ కార్యాలయానికి తరలించినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో నవీన్‌, నాగరాజు, వీరన్న, శ్రీనివాస్‌, ప్రణవ్‌, సిబ్బంది ఉన్నారు.

రైస్‌ మిల్‌ జప్తు

ములుగు: జిల్లా కేంద్రంలో జీవంతరావుపల్లికి వెళ్లే మార్గంలోని సాయి సహస్ర రైస్‌ టెక్‌ మిల్లును శుక్రవారం సివిల్‌ సప్లయీస్‌ అధి కారులు జప్తు చేశారు. 2019–20 సంవత్సరానికి గానూ రూ.12 కోట్ల విలువ గల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన ఉండగా నాలుగు సంవత్సరాలుగా స్వలాభం కోసం వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎన్ని సార్లు నోటీసులు ఇ చ్చినా స్పందించకుండా దిక్కరిస్తున్న కారణంగా అధికారులు మిల్లుకు వెళ్లి స్టాక్‌లో ఉన్న బియ్యం, ధాన్యంను జప్తు చేశారు. రైతులు సా యి సహస్ర మిల్లుకు ధాన్యం అమ్మి మోసపోకూడదని అధికారులు రైతులకు సూచించారు.

సర్టిఫికెట్ల మంజూరులో అధికారుల నిర్లక్ష్యం

ములుగు రూరల్‌: జనన ధ్రువీకరణ పత్రాల మంజూరులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని భారత ప్రజా తంత్ర యువజన సమాఖ్య సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఏఓకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్‌ మాట్లాడుతూ పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో ఉన్నత చదువుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. పుట్టినప్పుడు ఆస్పత్రి సిబ్బంది ఆన్‌లైన్‌ చేయకపోవడంతో ప్రస్తుతం వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం ప్రభుత్వ ఉద్యోగుల వాగ్మూలంతో పాటు వివిధ సర్టిఫికెట్స్‌ జత చేసి తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేస్తే సంబంధిత అధికారులు నెలల తరబడి తిప్పుకుంటున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబాలకు జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొడపాక చంటి, రజీనికాంత్‌, కన్నయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

రామచిలుకకు వడదెబ్బ!

భూపాలపల్లి రూరల్‌: పట్టణంలో కారల్‌ మార్క్స్‌ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం ఎండవేడిమిని తట్టుకోలేక ఓ రామచిలుక రోడ్డుపై పడిపోయింది. గమనించిన స్థానికులు రామచిలుకను చేరదీసి, నీటిని తాగించారు. కాసేపు చల్లటి వాతావరణంలో ఉండేలా చూశారు. దీంతో కోలుకున్న రామచిలుక తోటిరామచిలుకల చెంతకు రెట్టించిన ఉత్సాహంతో ఎగిరిపోయింది.

ఇసుక క్వారీల్లో  కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
1/2

ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

ఇసుక క్వారీల్లో  కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
2/2

ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

Advertisement
Advertisement