ధాన్యం రైతుకు దన్నుగా..! | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతుకు దన్నుగా..!

Published Sat, May 4 2024 8:25 AM

ధాన్యం రైతుకు దన్నుగా..!

కోవెలకుంట్ల: ఖరీఫ్‌లో వరి సాగుతో లాభాలు గడించిన రైతులకు రబీ కూడా కలిసోచ్చింది. సీజన్‌లో సకాలంలో వర్షాలు కురియకపోయినా అందుబాటులో ఉన్న సాగునీటి వనరులు అన్నదాతను గట్టెక్కించాయి. పైరు వివిధ దశల్లో సాగునీరు పుష్కలంగా అందటంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం, మార్కెట్‌లో ధాన్యానికి మద్దతు ధర ఉండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో బోర్లు, బావులు, చెరువులు, కుందూనది, పాలేరు, కుందరవాగు,తదితర సాగునీటి వనరుల ఆధారంగా 32 వేల ఎకరాల్లో కర్నూలుసోనా, 555 రకాలకు చెందిన వరిని రైతులు సాగు చేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని అవుకు మండలంలో 2,475 ఎకరాలు, ఉయ్యాలవాడ మండలంలో 630 ఎకరాలు, కోవెలకుంట్ల మండలంలో 450 ఎకరాలు, దొర్నిపాడు మండలంలో 121 ఎకరాలు, సంజామల మండలంలో 70 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం వరిపంట చేతికందటంతో కోత నూర్పిడి పనుల్లో రైతుల్లో నిమగ్నమయ్యారు.

ఊరిస్తున్న మద్దతు ధర..

ఈ ఏడాది కోటి ఆశలతో వరి సాగు చేయగా సాగునీటి వనరులు రైతులను గట్టెక్కించాయి. వరినారు, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు, కోత, నూర్పిడి, తదతర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు వెచ్చించారు. పైరు వివిధ దశల్లో దోమ, ఎర్ర తెగులు ఆశించగా రైతులు సకాలంలో గుర్తించి క్రిమి సంహారక మందుల పిచికారితో తెగుళ్లు అదుపులోకి వచ్చాయి. వాతావరణం అనుకూలంగా మారి పంట పండి ఎకరాకు 30 నుంచి 32 బస్తాల దిగుబడులు వస్తున్నాయి. వరిసాగుకు ముందే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్‌–1 రకం క్వింటా 2,203, గ్రేడ్‌–2 రకం రూ. 2,183 ధర నిర్ణయించారు. వరికి మద్దతు ధర ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వరిపైరు చేతికందటంతో రైతులు కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కంబైండ్‌ హార్వెస్టర్‌ యంత్రాలతో వరి కోత. నూర్పిడి పనులు జరుగుతున్నాయి. ఎకరా వరి కోత, నూర్పిడికి రూ. 3వేలు ఖర్చు అవుతోంది. మార్కెట్‌లో ధర ఉండటంతో నూర్పిడి చేసిన వెంటనే వడ్లను విక్రయిస్తున్నారు. పచ్చివడ్లను బస్తా రూ. 1,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు ఆశాజనకంగా వస్తుండటం, ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర ఉండటంతో ఆదాయం చేకూరుతుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

క్వింటాకు రూ. 2,203 ధర

జిల్లాలో రబీలో 32 వేల ఎకరాల్లో

వరిసాగు

సాగునీటి వనరులతో గట్టెక్కిన రైతు

ఎకరాకు 30–32 బస్తాల

దిగుబడులు

ముమ్మరంగా కోత, నూర్పిడి పనులు

అన్నదాతకు అండగా నిలిచిన

రాష్ట్ర ప్రభుత్వం

Advertisement
Advertisement