జిల్లాలను కుదిస్తే ఊరుకోం | Sakshi
Sakshi News home page

జిల్లాలను కుదిస్తే ఊరుకోం

Published Sat, May 4 2024 9:05 AM

జిల్లాలను కుదిస్తే ఊరుకోం

● కుమురంభీం స్ఫూర్తితో ఉద్యమిస్తాం ● ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌అర్బన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాల కుదింపు చర్యలకు పాల్పడితే ఊరుకోమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆరు అబద్ధపు గ్యారంటీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను కుదించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాను రద్దు చేస్తే ఆదివాసీ యోధుడు కుమురంభీం స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు తర్వా త ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జిల్లాను తొలగిస్తే అభివృద్ధి కుంటుపడి ఆదివాసీలు అవస్థలు పడే అవకాశం ఉందన్నారు. కుమురంభీం ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందని, నాణ్యత లోపానికి ఆ పార్టీయే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కాలువలు పూర్తి కాకముందే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడితే సహించేంది లేదన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం జిల్లా ఏ హామీలు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చేస్తారా.. లేకుంటే పట్టించుకోరా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు 40వేల మెజారిటీ సాధించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చిలువేరు వెంకన్న, నాయకులు జీవన్‌, తారీఖ్‌, హైమద్‌, రవికుమార్‌, నిసార్‌, రాపర్తి కార్తీక్‌, యాదగిరి, రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement