పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి

Published Sat, May 4 2024 12:53 AM

పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి

ఖమ్మం సహకారనగర్‌: కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉద్యోగులు ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీ.పీ. గౌతమ్‌ సూచించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలల్లో అధికారులకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణను ఆయన పరిశీలించి మాట్లాడారు. మాక్‌ పోలింగ్‌, ఈవీఎంల పనితీరుపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు.

గైర్హాజరైన వారికి మరోమారు శిక్షణ

ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగుల్లో శిక్షణకు గైర్హాజరైన వారితో పాటు పూర్తి అవగాహన రాని వారికి మరోమారు శిక్షణ ఇవ్వాలని ఆర్‌ఓ, కలెక్టర్‌ గౌతమ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల నోడల్‌ అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయం సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించిన విషయాన్ని ప్రచారం చేయాలని చెప్పారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతీ ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు.

అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

లోకసభ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సమకూర్చుకున్న అదనపు ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్‌ పూర్తయిందని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఏఆర్‌ఓలు, పార్టీల అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షాన ర్యాండమైజేషన్‌ పూర్తిచేశామని చెప్పారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, కేఎంసీ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మ్రినాల్‌ శ్రేష్ఠ, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, డీఏఓ విజయనిర్మల, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీఓలు జి.గణేష్‌, ఎల్‌.రాజేందర్‌, అదనపు డీసీపీ ప్రసాదరావు, తహసీల్దార్‌ సీహెచ్‌.స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల శిక్షణలో కలెక్టర్‌ గౌతమ్‌

Advertisement
Advertisement