మహిళ సాక్ష్యం..దర్యాప్తు ముమ్మరం | Sakshi
Sakshi News home page

మహిళ సాక్ష్యం..దర్యాప్తు ముమ్మరం

Published Sat, May 4 2024 8:55 AM

-

శివాజీనగర: లైంగిక దాడుల కేసులో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక తనిఖీ బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాట్లు చేసుకుంటోంది. అశ్లీల వీడియో కేసు తనిఖీ జరుపుతున్న సిట్‌ అధికారులు వీడియోలో ఉన్న కొందరి మహిళలను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించగా ఓ మహిళ ముందుకు వచ్చింది. ఆమె ఇచ్చిన సాక్ష్యం మేరకు లైంగిక దాడుల ఆరోపణ కింద ప్రజ్వల్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు కొత్తగా ఐపీసీ సెక్షన్‌– 376ను చేర్చటం ద్వారా అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ తనను ఆశపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు న్యాయమూర్తి ముందు వెల్లడించారు. సీఆర్‌పీసీ 164 కింద సాక్ష్యం నమోదైంది. ప్రజ్వల్‌ రేవణ్ణపై సీఐడీ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రెండవ ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన సెక్షన్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. ఐపీసీ 376 (2) ఎన్‌506, 354ఎ1, 354బీ, 354సీ సెక్షన్లు, ఐటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బెదిరించి నిరంతరం అత్యాచారం చేయడంపై 376(2) ఎన్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఇది రుజువైతే పదేళ్ల జైలు లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. రెండవ ఎఫ్‌ఐఆర్‌లో ప్రజ్వల్‌ రేవణ్ణ నిందితుడిగా ఉన్నాడు. తొలి ఫిర్యాదులో హెచ్‌డీ రేవణ్ణ కూడా నిందితుడు. ప్రజ్వల్‌ రేవణ్ణ భారత్‌కు వచ్చిన తక్షణమే అరెస్ట్‌ చేసేందుకు ఎస్‌ఐటీ భావిస్తోంది.

రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరణ:

లైంగిక దౌర్జన్య కేసులో అరెస్ట్‌ భయంతో ముందస్తు బెయిల్‌ కోసం బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మాజీ మంత్రి హెచ్‌.డీ.రేవణ్ణ ఉపసంహరించుకొన్నారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. సిట్‌ తరఫున ఎస్‌పీసీబీ ఎన్‌.జగదీశ్‌ వాదనలు వినిపించారు. విచారణకు హాజరుకావాలని రేవణ్ణకు నోటీస్‌ ఇచ్చామన్నారు. ఇది బెయిల్‌ రహితం కాదని, పిటిషన్‌దారుడి అరెస్ట్‌ అవసరమనే సమస్య రాదన్నారు. ముందస్తు బెయిల్‌ అవసరం లేదని వివరించారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు రేవణ్ణ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ఎంపీ ప్రజ్వల్‌ భారత్‌కు వచ్చిన తక్షణమే అరెస్ట్‌ చేసేలా సిట్‌ కసరత్తు

Advertisement
 
Advertisement