దేశాభివృద్ధి కోసం మోదీని బలపరచండి | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధి కోసం మోదీని బలపరచండి

Published Sat, May 4 2024 8:55 AM

దేశాభివృద్ధి కోసం మోదీని బలపరచండి

సాక్షి, బళ్లారి: దేశ సమగ్రాభివృద్ధి, భద్రత, రక్షణ కోసం బీజేపీని బలపరచాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కర్ణాటకలోని బెళగావి జిల్లా హుక్కేరిలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కుటుంబ రాజకీయాలు కావాలా? మన సంస్కృతి వారసత్వాలు కాపాడే బీజేపీ కావాలా? తేల్చుకోవాలని ఓటర్లకు సూచించారు. ప్రధాని మోదీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ఆయన హయాంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందన్నారు. రాహుల్‌ బాబా, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేకు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పంపినా రాలేదన్నారు. ఓట్‌ బ్యాంక్‌ కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి వారికి మనం ఓటు వేయాలా అని ప్రశ్నించారు.

ఆలయాల పనులు పూర్తి

కాశీ కాళిదాసు, సోమనాథ మందిరం మొదలైన అసంపూర్ణ నిర్మాణ పనులను మోదీ పూర్తి చేశారన్నారు. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించడంలో మోదీ తీసుకున్న నిర్ణయంపై దేశ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఆర్టికల్‌–370 రద్దు చేయడంతో కశ్మీరీలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఉగ్రవాదులను అణచి వేయడంతో పాటు టీఎఫ్‌ఐని నిషేధించామన్నారు. బెంగళూరులో బాంబు పేలుడు, నేహా హిరేమఠ హత్య సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. హిందూ వ్యతిరేకులకు, హిందువులను అవమానం చేసిన వారికి, హిందూ సనాతన ధర్మ రక్షణ చేసే వారికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏటా రూ.10 వేలు వచ్చేదని, ప్రస్తుతం రైతులకు కాంగ్రెస్‌ సర్కారు అన్యాయం చేస్తోందన్నారు. రాహుల్‌ బాబా కంపెనీ నుంచి దేశాన్ని రక్షించేందుకు మోదీని బలపరచాలన్నారు. బీజేపీ అభ్యర్థి అణ్ణాసాహెబ్‌ జొల్లె, పార్టీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Advertisement
Advertisement