దళితుల విరోధి ఆ జాతీయ పార్టీనే | Sakshi
Sakshi News home page

దళితుల విరోధి ఆ జాతీయ పార్టీనే

Published Sat, May 4 2024 8:50 AM

దళితుల విరోధి ఆ జాతీయ పార్టీనే

సాక్షి,బళ్లారి: ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ దళితులను ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకుంటోంది కాని సంక్షేమ, అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని మాజీ మంత్రి, దళిత నాయకుడు మహేష్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని హరిహర బ్రహ్మదేవుళ్లు వచ్చినా మార్చడానికి కాదన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి మోదీ కూడా వెల్లడించారన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని కాంగ్రెస్‌ చూస్తోందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు అబద్ధం అన్నారు. ఒక దళితుడుగా చెబుతున్నా దళితులకు మోసం చేసింది, చేస్తున్నది, చేయబోయేది కాంగ్రెస్‌ పార్టీనే కాని బీజేపీ కాదన్నారు. దళితులకు సంబంధించిన నిధులను పక్కదారి పట్టించి, గ్యారెంటీలకు ఉపయోగించుకుని, ఆ గ్యారెంటీల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, అగ్రవర్ణాలకు నెలకు రూ.2లు వేస్తోందన్నారు. దళితుల సొమ్మును పక్కదారి పట్టించి మోసం చేసింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలి

డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ను ఓడించిన కాంగ్రెస్‌ పార్టీని కూడా ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. అంబేడ్కర్‌ చనిపోతే ఆయనకు ఆరు అడుగుల స్థలం ఇవ్వకుండా అవమానించిందని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ పార్టీలో ఒక్క క్షణం కూడా దళితులు ఉండకూడదన్నారు. అంబేడ్కర్‌కు ప్రధానమంత్రి కావడానికి కూడా అవకాశం వస్తే తప్పించింది ఎవరు అని ప్రశ్నించారు. దళిత వర్గాలకు ఎన్నో అన్యాయాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని ఓటు ద్వారా తిరస్కరించాలన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీ సర్కార్‌ను మరోసారి కేంద్రంలో గద్దెనెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మోకా, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మురహరగౌడ, జిల్లా రైతు సంఘం బీజేపీ నాయకులు గణపాల ఐనాథరెడ్డి, బీజేపీ నాయకులు హనుమంతప్ప, రామచంద్రయ్య, సుప్రీంకోర్టు న్యాయవాది గోవిందు, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

హరిహర బ్రహ్మదేవుళ్లు కూడా

రాజ్యాంగాన్ని మార్చలేరు

మాజీ మంత్రి, దళిత నాయకుడు

మహేష్‌ మండిపాటు

Advertisement
Advertisement