లెక్క దాటితే పదవికే గండం | Sakshi
Sakshi News home page

లెక్క దాటితే పదవికే గండం

Published Sat, May 4 2024 8:15 AM

లెక్క దాటితే పదవికే గండం

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక్కొక్కరు రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. ఒకవేళ పరిమితి దాటితే ఎన్నికైనా సరే పదవి కోల్పోయే ప్రమాదముంది. గతంలో ఎన్నికల ఖర్చు రూ.70 లక్షలుండగా ప్రస్తుతం పెంచారు. ప్రచార సరళి, సభలు, సమావేశాలు, వాహనాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.

నామినేషన్‌ నుంచే లెక్క షురూ..

అభ్యర్థులు నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతీదానికి లెక్క చూపెట్టాల్సి ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్‌ వేయగా మిగతా పార్టీలవారు సాదాసీదాగా ఐదుగురితో కలిసి వేశారు. నామినేషన్‌ వేయడానికి ముందు అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల లావాదేవీలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ప్రలోభాల నియంత్రణకు నిఘా

ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలను నియంత్రించేందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టాటిక్‌ సర్వైలెన్స్‌, వీడియో సర్వైలెన్స్‌, వీడియో వీవింగ్‌, ఎంసీసీ బృందాల ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. సభల్లో ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు, వాహనాలు ఇతర సామగ్రితోపాటు ప్రచార కార్యక్రమాలను వీడియో తీస్తున్నారు.

వ్యయ పరిశీలకులు..

ఎన్నికల్లో ధన ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది. కరీంనగర్‌కు అశ్వినీకుమార్‌ పాండేను నియమితులయ్యారు. అభ్యర్థుల ఖర్చును వ్యయ బృందాలు మూడుసార్లు తనిఖీ చేస్తాయి. నామినేషన్‌ మొదలుకొని చివరివరకు, ఉపసంహరణ తర్వాత ఓట్ల లెక్కింపు వరకు నియోజకవర్గం పరిధిలోనే ఉంటారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన 27 రోజులకు మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. అభ్యర్ధుల వ్యయాలను ఖర్చులను పరిశీలించి, వ్యత్యాసం ఉంటే ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు అభ్యర్థులు ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు సమర్పించాలి. పరిమితికి మించి ఖర్చు చేసినా, వ్యయానికి సంబంధించిన లెక్కలను నిర్దేశించిన సమయంలో చూపకున్నా అనర్హత వేటు పడుతుంది. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. గెలిచినా, ఓడినా ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఈసీ నిర్ణయించిన ధరలు రోజువారీగా..

టెంట్‌కు రూ.2,500, జనరేటర్‌ రూ.7 వేలు, ఫంక్షన్‌హాల్‌ రూ.20 వేలు, ప్రచార రథం రూ.3 వేలు, పోస్టర్లు రూ.5 వేలు, హోర్డింగ్‌లు రూ.6 వేలు, డప్పులు ఒకరికి రూ.700, కళాబృందాలు ఒకరికి రూ.1000, ఎల్‌ఈడీ స్క్రీన్‌ రూ.5 వేలు, ఎయిర్‌ కూలర్‌ రూ.1,500, ఇన్నోవా రూ.3,500, ఆటో రూ.1,500, వ్యాన్‌ రూ.7 వేలు, టీ రూ.10, స్నాక్స్‌ రూ.15, సాదాభోజనం రూ.40, హోటల్‌ చార్జీలు రోజుకు రూ.2 వేలు, వీడియో నెలకు రూ.45 వేలు ఖర్చు చేయాలి.

ఎంపీ అభ్యర్థి ఖర్చు రూ.95 లక్షలు

గతంలో రూ.70 లక్షలే

ఎలక్షన్‌ కమిషన్‌ నిఘా

Advertisement
Advertisement