ఆరోగ్యమస్తు | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమస్తు

Published Sat, May 4 2024 10:15 AM

ఆరోగ్

ప్రభుత్వ వైద్య రంగం అభివృద్ధి

కొత్తగా ఆరోగ్య కేంద్రాల నిర్మాణం

ప్రగతి బాటలో ప్రభుత్వాసుపత్రులు

ఆరోగ్యశ్రీ పరిధి విస్తరణ

వినూత్నంగా ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు

‘ఆరోగ్య సురక్ష’తో అందరికీ వైద్య పరీక్షలు

కాకినాడ క్రైం: కానరాని వైద్యులు.. చాలీచాలని సిబ్బంది.. అరకొరగా మందులు.. కానరాని సౌకర్యాలు.. తుప్పు పట్టిపోయిన మంచాలు.. దుర్భరంగా ఉండే పడకలు.. ఏ వైద్య పరీక్ష కావాలన్నా బయటి ల్యాబ్‌ల వద్దకు వెళ్లక తప్పని దుస్థితి.. గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి.. ఇదీ ఒకప్పుడు ప్రభుత్వ వైద్యరంగం తీరు.

నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ వైద్య రంగం ముఖచిత్రం గడచిన ఐదేళ్లలో సమూలంగా మారిపోయింది. ఎంతలా అంటే.. కేవలం సాధారణ వైద్య సేవలకే ఆరోగ్య కేంద్రాల ఆవరణల్లో పడిగాపులు కాసే దుస్థితి నుంచి.. స్పెషలిస్టులే నేరుగా ఇంటి వద్దకు వెళ్లి మరీ వైద్య సేవలు అందించేంతలా మార్పు వచ్చింది. జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌) నుంచి.. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించింది. చివరకు ప్రభుత్వ వైద్య సేవలను గ్రామ స్థాయికి సైతం తీసుకుని వచ్చేందుకు పల్లెల్లో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. అవసరమైన సిబ్బందిని నియమించింది. అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచింది. అంతే కాదు.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకుని వచ్చింది. దీని ద్వారా పల్లె ముంగిట్లో అవసరమైన వారందరికీ ఇంటి వద్దనే వైద్య సేవలు అందిస్తోంది.

424 కొత్త ఆరోగ్య కేంద్రాలు

జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 430 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉన్న ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేశారు. ఐదు పీహెచ్‌సీలు, తొమ్మిది అర్బన్‌ పీహెచ్‌సీలు (యూపీహెచ్‌సీ), 410 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జిల్లాలో 42 పీహెచ్‌సీలు, 23 యూపీహెచ్‌సీలు, 9 సీహెచ్‌సీలు, 410 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి ద్వారా ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్య కేంద్రం స్థాయి పెరుగుతున్నకొద్దీ అందని చికిత్స లేని రీతిలో వైద్య సేవలను విస్తరించారు.

తల్లీబిడ్డల ఆరోగ్యానికి..

తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మాతాశిశు మరణాలను నియంత్రించడమే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.

కాన్సెప్ట్‌ అదిరింది

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా జిల్లాలో వివిధ పీహెచ్‌సీల నుంచి ప్రత్యేక మెడికల్‌ మొబైల్‌ యూనిట్‌ వాహనాలు గ్రామ గ్రామానికీ వెళ్తున్నాయి. జిల్లాలో మొత్తం 35 వాహనాలు నిరంతరాయంగా ఆయా గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ వాహనాలతో వైద్య, ఆరోగ్య సిబ్బంది, మందులు, వైద్య ఆరోగ్య పరికరాలతో గ్రామాలకు వెళ్తున్నారు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. జనరల్‌ ఓపీతో పాటు గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొంది, ఇంటికి చేరిన పేషంట్లకు ఉదయం వేళల్లో ఇంటి వద్దనే సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాలను సందర్శిస్తూ, బాలల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. అలాగే, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించి, ఎక్కడైనా లోపాలుంటే సంబంధిత శాఖను తక్షణమే అప్రమత్తం చేసి, సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆరోగ్య రథ చక్రాలు

108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, నియోనేటల్‌ అంబులెన్సుల ద్వారా బాధితులు లేదా రోగులకు తక్షణ ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. గడచిన ఐదేళ్లలో సంఖ్యాపరంగానే కాకుండా సదుపాయాలపరంగా ఈ వాహన సేవలను ఎంతో వృద్ధి చేశారు. గర్భిణులకు అత్యవసర సమయాల్లో ఈ వాహనాల్లో ఉండే వైద్య, ఆరోగ్య సిబ్బంది సురక్షిత ప్రసవాలు చేసిన సందర్భాలు కోకొల్లలు.

ఆరోగ్య సిరి

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మంది రోగులకు కార్పొరేట్‌ స్థాయి చికిత్స ఉచితంగా అందిస్తున్నారు. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి సదరు వైద్య సేవలను తీసుకుని వచ్చేలా నూతన మార్పులు చేశారు. తద్వారా ఈ పథకాన్ని నిజంగానే ఆరోగ్య సిరిగా తీర్చిదిద్దారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిధిని దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏకంగా రూ.25 లక్షల కు పెంచడమే కాకుండా సుమారు 3,300 రోగాలు, చి కిత్స విధానాలను ఈ పథకం పరిధిలో చేర్చారు. ఆరో గ్యశ్రీ పథకం ద్వారా గడచిన రెండేళ్లలో 80,445 మంది లబ్ధి పొందగా వారికి రూ.189.38 కోట్లు వెచ్చించారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేయించుకుని, ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి జీవనోపాధి కోసం ‘ఆసరా’ పథకం ద్వారా 45,454 మందికి రూ.26.3 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు.

శిబిరాలతో సురక్షితం

జిల్లాకు గతంలో ఏనాడూ తెలియని రీతిలో వై ద్యపరంగా కీలక ముందడుగు వేస్తూ ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు. వీటి ద్వారా ఆ యా సచివాలయాల పరిధిలోని ప్రజలకు స్పెషలిస్టు వైద్యుల ద్వారా ఓపీ సేవలు అందించారు. అంతే కాకుండా అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో అవసరమైన చికిత్సలు ఉచితంగా అందించారు. రెండు విడతల్లో నిర్వహించిన 468 ఆరోగ్య సురక్ష శిబిరాల్లో 1,60,132 మంది వైద్య సేవలు పొందారు.

కంటికి ఆపరేషన్‌ చేయించుకున్నా..

వృద్ధాప్యంలో ఉన్న నాకు ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ఎంతో ప్రయోజనం కలిగింది. స్పెషలిస్టు దగ్గరకు వెళ్లి కంటి సమస్యను చూపించుకునే పరిస్థితి లేదు. మా ప్రాంతంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకున్నా. తక్షణమే సర్జరీ అవసరమని కంటి వైద్య నిపుణుడు సూచించి జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది అక్కడకు తీసుకుని వెళ్లి శస్త్రచికిత్స చేయించారు. ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నా.

– డి.విజయకుమారి, కాకినాడ

ఆరోగ్య కేంద్రాలు భేష్‌

గడచిన ఐదేళ్లలో స్థానిక ఆరోగ్య కేంద్రాలు సకల సదుపాయాలతో ఎంతో మెరుగుపడ్డాయి. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి జేబులకు చిల్లు పెట్టుకునే దుస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందని వైద్యం లేదు, దొరకని మందు లేదు, జరగని పరీక్ష లేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఉన్నాయి అంటే ఉన్నాయన్నట్లుగానే హెల్త్‌ సెంటర్లు నడిచేవి. కనీసం సిబ్బంది కూడా ఉండేవారు కాదు. అదీ కాక, రోగి మనసుకు ఆహ్లాదం కలిగే రీతిలో ఆరోగ్య కేంద్రాలను ఆకర్షణీయంగా పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నారు.

– నాగం దొరబాబు, రావికంపాడు, తొండంగి మండలం

ఆరోగ్యమస్తు
1/4

ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు
2/4

ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు
3/4

ఆరోగ్యమస్తు

ఆరోగ్యమస్తు
4/4

ఆరోగ్యమస్తు

Advertisement
 
Advertisement