ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Published Sat, May 4 2024 5:10 AM

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

భూపాలపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరూ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. స్వీప్‌ నోడల్‌ అధికారి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ క్రీడా మైదానం నుంచి జయశంకర్‌ విగ్రహం వరకు ఓట్‌ ఫర్‌ షూర్‌ నినాదంతో శుక్రవారం నిర్వహించిన 5కే రన్‌ను ఎస్పీ కిరణ్‌ ఖరేతో కలిసి కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. మే 13వ తేదీన ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్‌ శాతం అధికంగా నమోదయ్యేలా సహకరించాలన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్‌ చైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ కిరణ్‌ ఖరే మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఏర్పాట్లు

హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి పాఠశాలలో ఏర్పాట్లును పరిశీలించి తగు సూచనలు చేశారు. జిల్లాలో 2,072 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మూడు పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్‌ బూతులో రద్దీ నియంత్రణకు రెండు బాక్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి సమయం కేటాయించినట్లు తెలిపారు. 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న హోం ఓటింగ్‌లో నియోజకవర్గంలో 78మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

ప్రత్యేక అధికారుల నియామకం

ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు, నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో పోలింగ్‌ ఏర్పాట్ల పరిశీలనకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు తాగునీరు, విద్యుత్‌, ర్యాంపు, వీల్‌ చైర్‌, క్యూలో ఫ్యాన్లు వంటి సౌకర్యాలను ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఈ నెల 6వ తేదీ నాటికి ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తి కావాలన్నారు. 12, 13 తేదీల్లో పోలింగ్‌ సిబ్బంది బస, భోజన ఏర్పాట్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈవీఎంల కేటాయింపు..

సప్లిమెంటర్‌ ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించినట్లు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎంల కేటాయింపు ప్రక్రియకు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భవేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానానికి 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మూడు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని 317పోలింగ్‌ కేంద్రాలకు 127శాతంతో ఈవీఎంలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు అభినందన

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 10జీపీఏ సాధించిన విద్యార్థులను శుక్రవారం కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా కలెక్టరేట్‌లో అభినందించారు. చిట్యాల కస్తూర్భా గాంధీ విద్యాలయానికి చెందిన కొత్తూరు అంజన, పెద్దాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఊరుగొండ సాహిత్య, గాంధీనగర్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు చెందిన గడ్డం అక్షయ, ముత్యాల అభినయలకు కలెక్టర్‌ శాలువాలు కప్పి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీపీఓ శామ్యూల్‌ ఆర్డీఓ, సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మంగీలాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌, తహసీల్ధార్‌ శ్రీనివాస్‌, డీఈఓ రాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మండలాల ప్రత్యేక అధికారులు వీరే..

నారాయణరావు, డీపీఓ,

భూపాలపల్లి మండలం

నరేష్‌, డీఆర్‌డీఓ, గణపురం

శ్యామూల్‌, సీపీఓ, రేగొండ

విజయభాస్కర్‌, డీఏఓ, కొత్తపల్లిగోరి

వెంకటేశ్వర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, చిట్యాల

శైలజ, బీసీ సంక్షేమ అధికారి, టేకుమట్ల

సునీత, ఎస్సీ అభివృద్ధి అధికారి మొగుళ్లపల్లి

సంజీవరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శాయంపేట

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి

భవేశ్‌ మిశ్రా వెల్లడి

Advertisement
Advertisement