ట్యాంకు ఉన్నా.. తాగు నీరేది? | Sakshi
Sakshi News home page

ట్యాంకు ఉన్నా.. తాగు నీరేది?

Published Sat, May 4 2024 9:00 AM

ట్యాంకు ఉన్నా.. తాగు నీరేది?

● భగీరథ నీళ్లు ఎరుగని కలిగోట తండా ● ఏళ్లుగా విన్నవించినా ఫలితం లేదంటున్న గ్రామస్తులు

కథలాపూర్‌(వేములవాడ): తలాపున గోదావరి ఉన్నా తాగేందుకు గుక్కెడు నీరు కరువు అన్న చందనంగా ఉంది కథలాపూర్‌ మండలం కలిగోట గిరిజన తండావాసుల పరిస్థితి. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా పేర్కొంటున్నా కలిగోట గిరిజన తండాకు ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. భగీరథ ద్వారా నల్లా నీళ్లు ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఏళ్లుగా విన్నవించినా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనెక్షన్లు ఇవ్వని అధికారులు

వేములవాడ నియోజకవర్గం కథలాపూర్‌, మేడిపెల్లి, బీమారం మండలాల్లోని గ్రామాలకు భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీరు సరఫరా చేసేందుకు కలిగోట తండాలోనే బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ ట్యాంక్‌ నిర్మించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆగ్రహారం నుంచి పైపులైన్‌ ద్వారా నీళ్లు వచ్చి ఈ ట్యాంకులోకి చేరేలా పైపులైన్‌ ఏర్పాటు చేశారు. కలిగోట తండాలో నిర్మించిన రిజర్వాయర్‌ ట్యాంక్‌ నుంచి 3 మండలాలకు తాగునీరు సరఫరా చేస్తారు. కానీ తండాలోని సుమారు 60 కుటుంబాలకు తాగునీరు ఇచ్చేందుకు ప్రత్యేకంగా పైపులైన్‌ వేయలేదు. దీంతో భగీరథ నీరు అందడం ఐదేళ్లుగా కలగానే మిగిలిందని వాపోతున్నారు. ఫలితంగా తండావాసులు తాగేందుకు బోరుబావుల నీరే దిక్కయింది. ఇప్పటికై నా పాలకులు చొరవచూపి భగీరథ నీళ్లు అందేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement