అదనపు ఈవీఎం అవసరమే.. | Sakshi
Sakshi News home page

అదనపు ఈవీఎం అవసరమే..

Published Sat, May 4 2024 9:00 AM

అదనపు ఈవీఎం అవసరమే..

● మొదట ఒకటే ఈవీఎం అంచనా ● అభ్యర్థుల సంఖ్య పెరగడంతో మరో ఓటింగ్‌ మిషన్‌ కోసం కసరత్తు

కోరుట్ల: నిజామాబాద్‌ పార్లమెంట్‌ బరిలో ఉన్న అభ్యర్థులు 29 మంది కావడంతో ఒక్క ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌తో సరిపెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొదట బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య 16 వరకు ఉంటుందని ఎన్నికల అధికార యంత్రాంగం అంచనా వేసి తమ తమ సెగ్మెంట్ల పరిధిలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక ఈవీఎం చొప్పున తెప్పించుకుని భద్రపరిచారు. ప్రస్తుతం నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు 29 మంది కావడంతో మరో ఈవీఎం అవసరమైంది.

ఈవీఎంల సర్దుబాటు

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో 254, కోరుట్ల నియోజకవర్గంలో 262 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక్కో ఈవీఎం చొప్పున అందుబాటులో ఉంచాలి. పోలింగ్‌ రోజు ఈవీఎంలో సాంకేతిక లోపాలతో పనిచేయని పరిస్థితి తలెత్తితే అక్కడ వేరే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ అమర్చడానికి వీలుగా అదనంగా 20 శాతం లెక్కన జగిత్యాల సెగ్మెంట్‌లో 315, కోరుట్ల సెగ్మెంట్లలో 327 ఈవీఎంలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల సంఖ్య 16 లోపు ఉంటే ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు సరిపోయేవి. కానీ అభ్యర్థుల సంఖ్య 29 కావడంతో ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 2 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది.

రెట్టింపు ఈవీఎంలు

పార్లమెంట్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 2 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో 654, జగిత్యాలలో 640 ఈవీఎంలు అవసరముంటాయి. దీంతో ఈవీఎంల ను జగిత్యాల, కోరుట్ల డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల అ ధికారులు పూర్తి చేశారు. వీటిలో పాటు కోరుట్ల సె గ్మెంట్‌లో 366 కంట్రోల్‌ యూనిట్లు (సీయూ), జగి త్యాల సెగ్మెంట్‌లో 350 కంట్రోల్‌ యూనిట్లను ఇప్పటికే భద్రపరిచారు. సాధారణంగా పోలింగ్‌ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తడానికి ఈవీఎంల కంటే కంట్రోల్‌ యూనిట్లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్‌ బూత్‌కు ఒకటి సరిపోయే కంట్రోల్‌ యూనిట్లను 150 శాతం అదనంగా అందుబాటులో ఉంచుతున్నారు.

Advertisement
 
Advertisement