బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని ఎదురుదెబ్బ! | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని ఎదురుదెబ్బ!

Published Sat, May 4 2024 8:11 AM

Rishi Sunak Conservative Party Heavy Losses In UK Local Elections

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి ఓటమి ఎదురైంది. గత 40 ఏళ్ల చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఇంతలా ఓటమి చెందడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో ఈ ఏడాది చివర్లలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాయి. కాగా, బ్రిటన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్‌ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో, ప్రధాని రిష్‌ సునాక్‌పై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అలాగే, ఈ ఫలితాలు ప్రధాని  పీఠంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, బ్రిటన్‌లో 107 కౌన్సిల్స్‌కు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ముందంజలో కొననసాగుతోంది. 

 

కాగా, బ్లాక్‌పూల్ సౌత్‌లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్‌పై లేబర్ పార్టీ అభ్యర్థి క్రిస్ వెబ్ ఘన విజయం సాధించారు. టోరీల నుంచి లేబర్‌ పార్టీకి 26 శాతం ఓటు స్వింగ్ అయింది. 1945 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గత 40 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే దారుణ ఫలితమని, కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరును అంతా గమనిస్తున్నారని ప్రొఫెసర్ జాన్ కర్టీస్‌ తెలిపారు.

 

 

మరోవైపు.. బ్లాక్‌పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారైంది. ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. బ్లాక్‌పూల్‌ సౌత్‌ ఉప ఎన్నికల్లో 26 శాతంతో తమ పార్టీ విజయం సాధిచడం కీలక పరిణామం అని లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్‌మర్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఫలితాలు టోరీలు కౌన్సిల్ సీట్లలో సగం కోల్పోవచ్చని అంచనాలు వస్తున్నాయని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ వారాంతంలో లండన్‌ మేయర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో లేబర్ పార్టీ లండన్ మేయర్ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక, ప్రచారంలో తనకు సహకరించిన ప్రజలకు, తనను ఆదరించిన ఓటర్లకు ఆయన ప్రత్యర్థి బ్రిటీష్ భారతీయ వ్యాపారవేత్త తరుణ్ గులాటి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భారత్‌ సహా ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని గులాటి వ్యాఖ్యలు చేశారు. 
 

Advertisement
Advertisement