Donald Trump: పాత కేసులో కొత్త చిక్కులు | Sakshi
Sakshi News home page

Donald Trump: పాత కేసులో కొత్త చిక్కులు

Published Thu, Apr 25 2024 4:18 PM

Donald Trump hush money Case: The former president campaigns on case

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ పాత కేసులో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌. హష్ మనీ కేసు ఆయన మెడకు చుట్టుకుంటోంది. గత ఎన్నికల్లో ఆయన మోసానికి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తుండగా.. ఇది కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు ట్రంప్‌.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మోసానికి పాల్పడ్డారా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పోర్న్‌స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో ఆయన చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మోసానికి పాల్పడ్డారన్నది ప్రాసిక్యూషన్‌ వాదన.

స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి అఫైర్‌ను కప్పిపుచ్చిన ట్రంప్‌!
2016 ఎన్నికల ప్రచార సమయంలో.. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్‌. ఈ నాన్‌డిజ్‌క్లోజర్‌ అగ్రిమెంట్‌ను రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది స్టార్మీ. దీనిపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు నమోదు చేసింది.

2016 ఎన్నికల సమయంలో ట్రంప్‌ మోసానికి పాల్పడ్డారు : ప్రాసిక్యూషన్‌
తాజాగా ఈ కేసులో వాడీవేడి వాదనలు జరిగాయి. ప్రాసిక్యూటర్‌ తరపున వాదించిన మాథ్యూ కోలాంగెలో.. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ మోసానికి పాల్పడ్డారన్నారు. తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాలా యత్నించారని.. ఇందుకోసం సెక్స్‌ స్కాండల్‌ను కప్పిపుచ్చేలా వ్యవహరించారని ఆరోపించారు. తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మూయించడానికి ట్రంప్‌ డబ్బు ఖర్చు చేశారన్నారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమేనని.. కచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుందని బలంగా వాదించారు మాథ్యూ  కోలాంగెలో.

డొనాల్డ్‌ అమాయకుడు, ఎలాంటి నేరం చేయలేదు: ట్రంప్ తరపు న్యాయవాదులు
ప్రాసిక్యూషన్ అభియోగాలను ట్రంప్‌ తరఫు న్యాయవాదులు ఖండించారు. డొనాల్డ్‌ అమాయకుడని, ఎలాంటి నేరం చేయలేదని, అసలు మాన్‌హట్టన్‌ అటార్నీ ఆఫీస్‌ ఈ కేసును ఏనాడూ ప్రస్తావించలేదని వాదించారు. అధ్యక్ష ఎన్నికలకు దూరం చేసేందుకు ఇది తనపై జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్‌.

అధ్యక్ష పదవిలో ఉండగా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొని నెగ్గారు ట్రంప్‌. యూఎస్‌ కేపిటల్‌ మీద దాడి ఘటన, వైట్‌హౌస్‌ నుంచి కీలకమైన పత్రాల మిస్సింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు శృంగార కుంభకోణంలో కోర్టు విచారణ ద్వారా మరోసారి చిక్కుల్లో పడ్డారు. అమెరికా మాజీ అధ్యక్షుల్లో ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు ట్రంప్‌.

Advertisement
Advertisement