సరెండర్‌ చేసినా కుర్చీ వదలరు | Sakshi
Sakshi News home page

సరెండర్‌ చేసినా కుర్చీ వదలరు

Published Sat, May 4 2024 4:05 AM

సరెండర్‌ చేసినా కుర్చీ వదలరు

13 ఏళ్లుగా ఎంజీఎంలోనే తిష్ట

కోర్టు స్టేతో తిరిగి జాయినింగ్‌

ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కుర్చీని వదలడం లేదు. 13 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా ఇంకా ఎంజీఎంను వదలడం లేదు. పరిపాలన పరమైన కారణాలతో ఇటీవల ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ సదరు అధికారిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘకాలం పాటు ఆయన ఇక్కడే తిష్ట వేసిన ఆయనకు ఇక్కడ ఏం దొరికిందో ఏమో కానీ..? సరెండర్‌ ఉత్తర్వులకు కోర్టు నుంచి స్టే తెచ్చుకుని తిరిగి దర్జాగా తన సీటును అలంకరిస్తున్నాడు.

అసలు ఇక్కడ ఏముంది.?

పరిపాలన విభాగంలో పనిచేసే ఈ విభాగం అధిపతి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి మొదలుకొని జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు దశాబ్దాలు ఎంజీఎంను వీడడంలేదు. ఇటీవల ఆస్పత్రిలో అంతర్గత బదిలీలు నిర్వహించారు.అయితే కొత్తగా కేటాయించిన స్థానాల్లో చేరిన కొందరు ఉద్యోగులు కేవలం మూడు రోజుల్లోనే తిరిగి ఎవరి స్థానాల్లో వారు జాయిన్‌ అయ్యారు. ఎంజీఎంలో బదిలీలకు విలువ లేకుండా పోయిందని, ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకునే నాథుడే కరువయ్యాయని విమర్శలు వినిపిస్తున్నారు.

సమగ్ర విచారణ చేపట్టాలి..

ఎంజీఎం పరిపాలన విభాగంలో సుదీర్ఘంగా తిష్ట వేసిన జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి మొదలుకొని ఏడీ వరకు వారు నిర్వహించిన సెక్షన్లపై ఏసీబీ ఉన్నతాధికారులచే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను బదిలీలు చేసే ప్రభుత్వం ఎంజీఎంను ఎందుకు విస్మరిస్తుందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు సమూల మార్పుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement