సర్వేజనా సుఖినో ‘భవంతి’ | Sakshi
Sakshi News home page

సర్వేజనా సుఖినో ‘భవంతి’

Published Sat, May 4 2024 10:25 AM

సర్వేజనా సుఖినో ‘భవంతి’

ఉప్పలగుప్తం: అన్ని సేవలూ అందుబాటులోకి వస్తే.. ఏ పనైనా సకాలంలో పూర్తయితే.. ఇంకేం కావాలి. రైతులు, ప్రజలు, అన్ని వర్గాలకూ ఒకేచోట నుంచి సేవలు అందితే, ఆ సేవా కేంద్రాలూ చూడముచ్చటగా కనిపిస్తే ఆ ఊరే మారుతోంది. ప్రగతి చాటుతోంది. అచ్చం అలానే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధి సూదాపాలెంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఒకేచోట ముచ్చట గొలుపుతున్నాయి. ము ఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఒకేచోటకు రావటంతో ఈ పల్లె ప్రగతి చాటుతోంది. ప్రతి రెండు వేల మంది జనాభాకు చేరువగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలనే దృక్పథంతో ఈ భవనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. రూ.43.60 లక్షలతో సచివాలయ భవనం, రూ.23.94 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.20. 80 లక్షలతో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను నిర్మించారు.

ఇద్దరు జమీందార్లను ఓడించిన పిన్నమనేని

కొవ్వూరు తొలి ఎమ్మెల్యే రికార్డు

కొవ్వూరు: కొవ్వూరు మొట్టమొదటి ఎమ్మెల్యేగా సీపీఐ అభ్యర్థి పిన్నమనేని రామచంద్రరావు గెలుపొందారు. 1952 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అన్నదేవరపేట జమీందారు అల్లూరి బాపినీడు, ప్రజాపార్టీ అభ్యర్థిగా దొమ్మేరు జమీందారు పెండ్యాల వెంకట కృష్ణ రంగారావు(మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు తండ్రి)తో పిన్నమనేని రామచంద్రరావు పోటీ పడ్డారు. ఇద్దరు ఉద్దండులైన జమీందార్లతో తల పడిన ఆయన ఆ ఎన్నికల్లో 6,681 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇద్దరు జమీందార్లను ఓడించిన వ్యక్తిగా పిన్నమనేని కొవ్వూరు ఎన్నికల చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన నాయకుడిగా ఆయన ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు.

బూత్‌ క్యాప్చరింగ్‌ అంటే..

రాయవరం: ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడం, పోలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడాన్ని బూత్‌ క్యాప్చరింగ్‌ అంటారు. ఎవరైనా కావాలని బ్యాలెట్‌ పేపరు గానీ, ఈవీఎంలను గానీ పాడు చేయడం, విరగ్గొట్టడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం వంటి చర్యలకు పాల్పడటం ఇందులో భాగంగా ఉంటాయి. పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను భయపెట్టడం, పోలింగ్‌ను అడ్డుకోవడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే ప్రభుత్వ సిబ్బంది అయితే ఐపీసీ 1951 సెక్షన్‌ 135ఎ, 136 ప్రకారం మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇతరులైతే ఒకటి నుంచి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

05కెవీఆర్‌01:

Advertisement
Advertisement