బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం

Published Sat, May 4 2024 9:35 AM

-

ఈ కేసులో నిందితుడైన జడ్జి తమ్ముడు రామచంద్ర అరెస్టు

ప్రచారం కోసమే మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు

సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది.

గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్‌ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్‌ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. 

ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement