బాబుది బూటకపు మేనిఫెస్టో | Sakshi
Sakshi News home page

బాబుది బూటకపు మేనిఫెస్టో

Published Sat, May 4 2024 9:35 AM

బాబుది బూటకపు మేనిఫెస్టో

మదనపల్లె: ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన బూటకపు మేనిఫెస్టోను ప్రపంచ బ్యాంకు సైతం అమలు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనకు శుక్రవారం వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఓటు అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 2014లో 100 పేజీల మేనిఫెస్టోలో 600 అబద్ధపు హామీలిచ్చి, ఏ ఒక్కటీ అమలుచేయలేదన్నారు. కేవలం క్యాపిటల్‌ చుట్టూ భూములను రియల్‌ ఎస్టేట్‌ చేసుకుని, లక్షల కోట్లు సంపాదించి, ఆ డబ్బులతో ఎన్నికల్లో ఖర్చుచేసి జగన్‌ను ఎదుర్కోవాలనే దురాలోచనతో ముందుకెళ్లారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ నారాలోకేష్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన క్యాపిటల్‌ భూములను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని, తండ్రీ, కొడుకులిద్దరికీ రాజధాని భూముల అభివృద్ధితో కోట్లు దోచేయడంపైనే ధ్యాస అధికమన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తామన్న చంద్రబాబు.. తిరిగి రాయచోటిలో జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పూర్తి నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన చంద్రబాబుకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. మేనిఫెస్టోలోని హామీలను 99శాతం అమలుచేసి, ప్రతి పేద కుటుంబానికి మేలుచేసి, ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ నాయకులు ఓట్లు అడిగే పరిస్థితి ఉంటే... జన్మభూమి కమిటీలు వేసుకుని, పచ్చచొక్కాలకే పథకాలు ఇచ్చే పరిస్థితి టీడీపీ పాలనదన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతిదీ పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా, కుల,మత, పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి చేశాం కనుకే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి ఓటు అడుగుతున్నామన్నారు. 2019 నుంచి 2024 వరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరికీ తెలుసన్నారు. పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే క్యాపిటల్‌ భూముల అభివృద్ధి తప్ప ప్రజాసంక్షేమం, అభివృద్ధి గురించి పట్టించుకోరన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, కొడుకు లోకేష్‌, బావమరిది బాలకృష్ణ, వదిన పురందేశ్వరి, దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌లు పనిగట్టుకుని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై, తనపై తిట్లపురాణం, గాలిమాటలు మాట్లాడటం చేస్తున్నారని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని చెప్పారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో సరైన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్‌అహ్మద్‌, నాయకులు ఎన్‌.శ్రీనాథరెడ్డి, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాదర్‌బాషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జింకా వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ బ్యాంకు సైతం అమలు చేయలేదు

జిల్లా కేంద్రాలపై బాబు ప్రకటనలు హాస్యాస్పదం

అబద్ధపు హామీలివ్వడంలో బాబు దిట్ట

వైఎస్‌ జగన్‌ చేసిన అభివృద్ధి

అందరికీ తెలుసు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Advertisement
 
Advertisement