‘క్రమం’ తప్పి బాబు ‘కక్ష’ | Sakshi
Sakshi News home page

‘క్రమం’ తప్పి బాబు ‘కక్ష’

Published Thu, Apr 25 2024 6:57 PM

Employees Regularization begins before the Election Code - Sakshi

నాటి రోజులు మీకు గుర్తు లేవా రామోజీ

కాం‍ట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దీకరణపై మాట తప్పింది బాబు కాదా ?

క్రమబద్ధీకరిస్తానని మేనిఫెస్టోలో పెట్టి వంచించారు

నాడు మంత్రుల కమిటీతో సర్కారు కాలయాపన

సుప్రీం కోర్టు తీర్పు అడ్డు అంటూ నిలువునా మోసం

ఆ నాటి మోసాలపై ఏనాడైనా ‘కలం’ కదిపారా రామోజీ ?

సిఎం జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల క్రమబద్ధీకరణ

అర్హతగల కాంట్రాక్టు ఉద్యోగులనే క్రమబద్దీకరిస్తామని స్పష్టం

ఎన్నికల కోడ్‌ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభం

గత ఏడాది డిసెంబర్‌ 13న ఆర్థికశాఖ మార్గదర్శకాలు జారీ

10 వేల మందికి పైగా ఉద్యోగుల క్రమబద్దీకరణకు అర్హులు

క్రమబద్దీకరిస్తున్నా ఈనాడు వక్రభాష్యం

సాక్షి, అమరావతి: అబద్దాలు అలవోకగా చెప్పడం చంద్రబాబుకే అలవాటు తప్ప ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డికి అవి వర్తించవు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్థీకరణ చేయకుండా మోసం చేసింది మీ చంద్రబాబే. గత చరిత్రను వదిలేసి ఇప్పుడు కళ్లు మూసుకుని రాసే రాతలు చెల్లవు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరించకుండా పరీశీలన చేయడానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమావేశాలతో కాలయాపన చేసి చివరికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డు వస్తోందని, దానికి సాధ్యం కాదంటూ కాంట్రాక్టు ఉద్యోగులను నిలువునా వంచించింది చంద్రబాబే. ఇవేమీ రామోజీకి అప్పట్లో కనిపించలేదు.

ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ అమలు చేస్తుంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల కోడ్‌ ముందు వరకూ జీవోలు ఇవ్వలేదంటూ మరో పచ్చి అవాస్తవాన్నీ ఈనాడు అచ్చువేసింది. అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌ 13నే ఆర్దికశాఖ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ఈనాడు మాత్రం ఎన్నికల షెడ్యూల్‌కు రెండు రోజులు ముందే ఉత్తర్వులు ఇచ్చినట్లు ఈనాడు మరో అబద్దాన్ని అచ్చు వేసింది.

మేనిఫెస్టోనే వక్రీకరిస్తున్న రామోజీ
వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫేస్టోలో అర్హత గల కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరిస్తామని పేర్కొంది తప్ప అందరినీ క్రమబద్దీకరిస్తామని చెప్పలేదు. ఎన్నికల మేనిఫేస్టోను కూడా వక్రీకరించి మరీ రామోజీ అవాస్తవాలను ప్రచురించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఎటువంటి కసరత్తు చేయలేదు. వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్దీకరించే విధంగా నిబంధనలను రూపకల్పన చేశారు.

ప్రభుత్వ రంగ సంస్ధలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారందరినీ క్రమబద్దీకరిస్తామని ఎక్కడా ఎన్నికల మేనిఫేస్టోలోగానీ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌.జగన్‌ చెప్పలేదు. వివిధ కేంద్ర పథకాల కింద పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు, ఆ పథకాల కొనసాగినంత కాలమే కొనసాగుతారు. ఈ విషయం తెలిసి కూడా ఆ ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదంటూ మరో వక్రభాష్యం చెప్పారు.

1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు మూసేయించారు. ఇందుకోసం ఇంప్లిమెంటేషన్‌ సెక్రటేరియట్‌ అని ఓ విభాగాన్నే సెక్రటేరియట్‌లో పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను పప్పూ, బెల్లాల మాదిరిగా తన వాళ్లకు అమ్మేసుకున్నారు.

ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్‌ ఫోర్చ్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ వంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. దాని గురించి అప్పట్లో ఒక్క వార్త రాయని ఈనాడు ఇప్పుడు మేనిఫేస్టోలో చెప్పకపోయినా ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉంది.

నిబంధనల ప్రకారమే క్రమబద్దీకరణ
చంద్రబాబు హయాంలో ఐదేళ్లు పాటు సాగదీసి గత ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ సాధ్యం కాదని చెప్పారు. వైఎస్‌.జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల కోడ్‌ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం అర్హులైనవారిని రెగ్యులరైజేషన్‌ చేసేందుకు ఆర్థికశాఖ చర్యలను చేపట్టింది. రెగ్యులరైజేషన్‌కు సంబంధించి మార్గదర్శకాలను ఆర్థిక శాఖ 13-12-2023న సర్క్యులర్‌ మెమో ద్వారా విడుదల చేసింది. దీనికి రూపొందించిన సాఫ్ట్ వేర్‌లో ఉద్యోగులు దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సిందిగా ఆర్దిక శాఖ స్పష్టం చేసింది.

సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అర్హులైన సుమారు పది వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 3,000 మందికిపైగా క్రమబద్దీకరించారు. మిగతా ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండు మూడు నెలల్లో ఆ ప్రకియ పూర్తి అవుతుంది. ప్రభుత్వంలో రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు పాటిస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులు సర్వీసును క్రమబద్దీకరిస్తారు.

ప్రభుత్వం అంటే రామోజీ సొంత జాగీరు కాదు రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు పాటించకపోవడానికి. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలనే నిబంధన ఇప్పుడు తెచ్చింది కాదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని టీడీపీ హయాంలో చంద్రబాబు అడ్డు పుల్ల వేశారు.

ఎన్నికల హామీ నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్‌పై ఆర్దిక మంత్రి, మానవ వనరుల మంత్రి, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులతో 09-09-2014న జీవో 3080 ద్వారా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది.

ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సర్కారు న్యాయం
ఇప్పుడు సీఎం వైఎస్‌.జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయ పరమైన చిక్కులు అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసింది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని వైస్సార్‌సీపీ మేనిఫేస్టోలో పేర్కొంది. దీని ప్రకారం రెగ్యులరైజ్‌ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది.

మంత్రుల కమిటీతో పాటు సీఎస్‌ అధ్యక్షతన వర్కింగ్‌ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు కమిటీ, వర్కింగ్‌ కమిటీ పలు సార్లు న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలపై చర్చించింది. ఇందుకోసం రెగ్యులరైజేషన్‌పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు.. బ్యాక్‌ డోర్‌ కాకూడదని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొంది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండే విధంగా న్యాయపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపెట్టి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయకుండా మోసం చేస్తే జగన్‌ సర్కారు సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయడానికి నిర్ణయం తీసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement