ప్రచండమే! | Sakshi
Sakshi News home page

ప్రచండమే!

Published Sat, May 4 2024 10:10 AM

ప్రచం

● జిల్లాలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ● బేలలో 44.9 డిగ్రీలుగా నమోదు ● నిర్మానుష్యంగా రహదారులు ● ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

ఆదిలాబాద్‌టౌన్‌: మే రాకతో జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. ఇప్పటికే 44 డిగ్రీల మార్కు దాటింది. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. బాబోయ్‌ ఇవేం ఎండలు అంటూ బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 దాటిందంటే గడప దాటేందుకు జంకుతున్నారు. అవసరం ఉంటే తప్పా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ముఖ్య కూడళ్లు పగటి పూట నిర్మానుష్యంగా మారుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం వరకూ ఎండ తీవ్రత తగ్గడం లేదు. శుక్రవారం బేలలో 44.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం.

ఉపశమనం కోసం ఆరాటం..

జిల్లాలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమ నం పొందేందుకు కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లే వారు తలకు రక్షక కవచాలు ధరిస్తున్నారు. మరోవైపు శీతల పానియాలు, కొబ్బరి బోండాలకు గిరాకీ పెరిగింది.

రాజకీయ నాయకుల తంటాలు..

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. ఎండలు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరో వైపు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రచారం చేపట్టేందుకు నేతలు మొగ్గుచూపుతున్నారు. అయితే సాయంత్రం కూడా వడగాలులు వీస్తున్నాయి. అయినా తమ పార్టీ గెలుపు కోసం శ్రేణులంతా గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

జర పదిలం..

జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో పని చేసే, తిరిగే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. అత్యవసరం అయి తే తప్పా ఎండలో బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఎక్కువ సమయంలో ఎండలో తిరిగితే శరీరంలో ప్రొటీన్‌ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని, శరీర ఉష్ణోగ్రతలు మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

జిల్లాలో మూడు రోజులుగా

నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు

(డిగ్రీ సెల్సియస్‌లో)

అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటే తప్పా ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కనీసం 5 లీటర్ల నీటిని తాగడం మంచిది. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

– జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌

తేది కనిష్ట గరిష్ట

మే 1న 26.2 42.8

2న 23.7 42.3

3న 20.2 44.9

ప్రచండమే!
1/2

ప్రచండమే!

ప్రచండమే!
2/2

ప్రచండమే!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement