వెచ్చని హృదయ రాగ సందేశం | Sakshi
Sakshi News home page

వెచ్చని హృదయ రాగ సందేశం

Published Tue, May 14 2024 5:30 AM

Sakshi Guest Column By Karan Thapar

అభిప్రాయం

ఇది నిన్ననే జరిగినట్లుగా నా జ్ఞాపకంలో స్పష్టంగా ఉంది. నిజానికైతే, నేను తొలిసారి ఫాదర్‌ టెర్రీ గిల్‌ఫెడర్‌ను కలిసింది నలభై ఏళ్ల కిందట! అది 1982 వేసవి చివరిలో... నిషా, నేను మా పెళ్లికి సిద్ధం అవుతున్న సమయం. ఒక క్యాథలిక్‌గా నిషా తను కోరుకున్న సంప్రదాయబద్ధమైన చర్చి వివాహానికి నేను నా అంగీకారాన్ని తెలిపినప్పుడు, స్థానిక పారిష్‌ చర్చి ప్రీస్ట్‌ను కలసి ఆయన చేత మూడు ఉపదేశాలు ఇప్పించుకోవలసి అవసరం ఏర్పడటం నన్ను చీకాకు పెట్టింది. కానీ వేరే దారి లేదు. వెదికితే, అతి దగ్గరగా నార్తంబర్లాండ్‌ అవెన్యూలో ఉన్న పునీత మేరీ మగ్దలీనా చర్చి ఒక్కటే నిషాకు ఒక క్రైస్తవేతరునితో వివాహం జరిపించేందుకు అంగీకరించింది, నిబంధనలకు లోబడి ఉండే షరతు మీద! 

సెప్టెంబరులో ఒక శనివారం, సాయంత్రం 6 గంటలప్పుడు నిషా, నేనూ ఫాదర్‌ టెర్రీ ఇంటి తలుపు తట్టాం. ఆయన తన డెస్క్‌ ముందు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్లజోడు ముక్కు చివరికి దిగి ఉంది. ఆ చిన్న గదికి ఎదురుగా ఉన్న ఒక పాత, వెలసిపోయిన లెదర్‌ సోఫా మీద మేము కూర్చున్నాం. బయట ఎప్పుడూ లేనంత వేడిగా ఉంటే, లోపల వాతావరణం మంచులో ఉన్నట్లుగా ఉంది. నేను ఊరకే ఉండలేకపోతున్నాను. 

‘‘షెర్రీ తీసుకుంటారా?’’ అని ఆయన అనటం నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ‘‘మీ ఇద్దరి గురించీ నాకు తెలియదు. కానీ నేను షెర్రీ పట్ల కొంత మొగ్గుగానే ఉన్నాను’’ అన్నారు.

అది టియో పెపె. నాకు ఇష్టమైనది. షెర్రీ బ్రాండ్‌. కానీ ఆ రోజుల్లో లండన్‌లో అది చాలా అరుదుగా మాత్రమే దొరికేది. ఫాదర్‌ టెర్రీ వివేచనతో కూడిన అభిరుచి గల వ్యక్తి. నేను ఆయనతో యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్, నాటింగ్‌ హిల్‌ కార్నివాల్, రష్దీ ‘మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌’ వంటివాటిపై చర్చిస్తూ ఉన్నాను– మేము చేసుకోబోయే వివాహం, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతాన్ని అనుసరించవలసి ఉంటుంది– అనేవి తప్ప... అన్నీ. 

ఫాదర్‌ టెర్రీ మా గ్లాసులను నింపుతూ సంభాషణను నడిపిస్తున్నారు. ఆయన నా వాదనను గ్రోలుతూనే, తన వాదనను సౌఖ్యంగా నిలిపి ఉంచుకుంటున్నారు. కాలం ఉల్లాసవంతమైన వేగంతో గడిచిపోయింది. వచ్చేవారం కలుద్దాం అనుకున్నాక, బయల్దేరేందుకు మేము లేచి నిలబడ్డాం. ఫాదర్‌ టెర్రీ మమ్మల్ని ఆపినప్పుడు మేము తలుపు దగ్గర ఉన్నాం. 

‘‘మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్న విషయమై ఒక ప్రశ్న  నా దగ్గర ఉంది’’ అన్నారు. ఆ ప్రశ్నకు సూచనగా చిరునవ్వొకటి  విశాలమైన ఆయన గుండ్రటి ముఖం మీద నాట్యమాడింది. ఆయన కళ్లు సూటిగా మావైపే చూస్తున్నాయి. ‘‘మీరిద్దరూ కలిసి ఎందుకు సహజీవనం చేయకూడదు?’’ అన్నారు ఫాదర్‌ టెర్రీ. 

మా ముఖాల్లోంచి రక్తం చివ్వున చిమ్మిందేమో నేను కచ్చితంగా చెప్పలేను కానీ, మేమిద్దరం మాత్రం నోట మాట రాక అలా ఉండిపోయాం. నిజం ఏమిటంటే నిషా, నేను అప్పటికే సహజీవనంలో ఉంటూ ఆ వాస్తవాన్ని దాచటానికి ఉద్దేశపూర్వకంగానే ఫాదర్‌ టెర్రీకి వేర్వేరు చిరునామాలను ఇచ్చాం. అది ఆయన ఊహించారు. అందుకే తన పద్ధతిలో అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పారు. 

నిషా పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వివాహాన్ని కోరుకుంది. వరుడు క్రైస్తవుడు కాదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ఫాదర్‌ టెర్రీ అందుకు సమ్మతించారు. ఆయన ఉపదేశ వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నరకం, అపరాధం, దైవం, çసచ్ఛీలత... వీటి గురించి ఆయన ఉపదేశించలేదు. ‘‘ఐ లవ్‌ యు’’ అనే మూడు చిన్న పదాల గురించి మాట్లాడారు. 

‘‘కరణ్, నిషా...’’,  ‘‘గుర్తుంచుకోండి. ‘ఐ’ నీ, ‘యు’నీ ‘లవ్‌’ జత కలుపుతుంది. కానీ అది వేరు కూడా చేస్తుంది. మీరిద్దరూ వేర్వేరు వ్యక్తులని మీరు మరచిపోయిన రోజున  మీ బంధం విడిపోతుంది’’ అన్నారు ఫాదర్‌ టెర్రీ. 

అదొక వెచ్చని, తేలికపాటి, హృదయపూర్వక సందేశం. లాంఛనప్రాయమైన తంతు కంటే కూడా నిప్పు చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం వంటిది. కానీ అది పావు శతాబ్దం పాటు నా మదిలో వెలుగుతూనే ఉండిపోయింది. 

ఆరేళ్ల తర్వాత, ఆసుపత్రిలో నిషా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లైఫ్‌ సపోర్టును తొలగించటానికి కొన్ని నిమిషాల ముందు ఫాదర్‌ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు చివరి మతకర్మను నిర్వహించారు. అమ్మను కూడా హైందవ సంప్రదాయం ప్రకారం నిషా చెవిలో ప్రార్థనలు వినిపించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత యంత్రాలు మెల్లగా, బాధగా మినుకు మినుకుమని కొడిగడుతున్నప్పుడు నిషా అంతిమ శ్వాసలో ఫాదర్‌ టెర్రీ నా పక్కన నిలబడ్డారు. 

నాకు తెలిసిన ఏకైక క్రైస్తవ మత గురువు టెర్రీ గిల్‌ఫెడర్‌. ఆయన ఒక వింత మనిషి అయినప్పటికీ ఒక గొప్ప వ్యక్తి. ఒరిస్సా, కర్ణాటకలలో క్రైస్తవులపై జరిగిన దాడి గురించి చదివిన ప్రతిసారీ నేను ఆయన గురించి ఆలోచిస్తాను. గాయపడిన హృదయాలను నయం చేసే పదాలను ఆయన కనుగొని ఉంటారని నేను నమ్ముతాను. అందుకు నిస్సందేహంగా ఆయనకు షెర్రీ సహాయపడి ఉంటుంది. 

కరణ్‌ థాపర్‌ 
– వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement