చైన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అన్ని కష్టాలను అధిగమించి విజయం సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తొలిప్రసంగం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలవడానికి అనేక కుట్రలను, ఆంక్షలను అధిగమించాల్సి వచ్చిందని అసెంబ్లీలో ప్రసంగించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కొద్ది రోజల పాటు గవర్నర్ వ్యవహారంతో డ్రామా నడిచిన మిత్రపక్షాల సహాయంతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తొలిసారిగా సీఎం హోదాలో ప్రసంగించారు.
అసెంబ్లీలో విజయ్ ప్రసంగిస్తూ " తమిళనాడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము పడిన కష్టాలు మాకు మాత్రమే తెలుసు… కానీ ఇదంతా తెలిసినప్పటికీ, కొందరు ఏమీ అర్థం కానట్టు నటిస్తూ, అతను కేవలం ఒక నటుడు, పార్టీ కూడా నటుల పార్టీనే అని ఎగతాలిగా మమ్మల్ని విమర్శిస్తారు. ఈ విజయం కోసం ఎన్నో కుట్రలను, కుతంత్రాలను అధిగమించి విజయం సాధించాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం, ప్రతివిషయంలో కేంద్రాన్ని వ్యతిరేకించబోం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్తితులు గాడిలో పెడతాం, మహిళలపై నేరాలు అరికట్టడంలో సింగపెన్ టాస్క్ ఫోర్స్ తొలి అడుగు వేసింది" అని విజయ్ అన్నారు.
ఇది వరకూ ప్రభుత్వం డీఎంకేలా తాము అవినీతి చేయబోమని పార్టీ ఫండ్స్ కోసం టాస్మాక్ ఆదాయాన్ని డీఎంకే లూటీ చేసిందని ఆరోపించారు. ద్విబాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.కాగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ ప్రకటించారు. అదేవిధంగా మరెన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.