సాక్షి, తాడేపల్లి: కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్, జేఎస్ డబ్ల్యు స్టీల్ బృందానికి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ఫోటోతో ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్దికి ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయి. యువతకు ఉపాధి అవకాశాలు లభించటం ద్వారా ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘‘ఎన్నో సంవత్సరాల కృషి, ప్లానింగ్ అనే పునాదుల మీద ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతాయి. మా ప్రభుత్వ హయాంలో జేఎస్ డబ్ల్యూ ప్రాజెక్టు రూపుదిద్దుకోవటానికి కీలకమైన పునాదులు వేశాం. పర్యావరణ అనుమతులు పొందేందుకు సహకరించాం. నీటి కేటాయింపులూ మా హయాంలోనే చేశాం. భూ కేటాయింపు, రోడ్ల అనుసంధానం, ఇతరత్రా మౌళిక సదుపాయాల కోసం అవసరమైన భూమిని కూడా అందించాం. అలాగే ప్రాజెక్టు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టాం. ఆ కారణంగానే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు కదిలాయి. కానీ దురదృష్టవశాత్తూ గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి
..ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు ఆలస్యమయింది. ఇప్పుడైనా పనులు తిరిగి ప్రారంభం కావటం సంతోషకరం. కడప ప్రజలు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇక ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కడప నా సొంత జిల్లా కావటంతో ఈ ప్రాజెక్టుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా అక్కడి యువతకు మంచి భవిష్యత్తు లభించాలని నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా నిరంతరం కొనసాగే ప్రక్రియ
..ఇప్పటికే జరిగిన పనులను కొనసాగిస్తూ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఏ ప్రభుత్వానికైనా ప్రాజెక్టుల పూర్తికి సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి, కడపతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలి. పారిశ్రామికాభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ఫలాలను అందించడంలో జేఎస్‌డబ్ల్యూకు సంపూర్ణ విజయం చేకూరాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.