Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. దారీ తెన్నూ లేని జెన్‌–జీ తుపాను
ADVERTISEMENT 

దారీ తెన్నూ లేని జెన్‌–జీ తుపాను

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Feb 6, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BANGLAHINDUS-protest.jpg

విశ్లేషణ

బంగ్లాదేశ్‌లో ఈ నెల 12న, నేపాల్‌లో వచ్చే నెల 5న పార్లమెంటు ఎన్నికలు జరగనుండగా, అక్కడ తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాలను కూలదోసిన జెన్‌–జీ ఉద్యమాలు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ఆ రెండు తిరుగుబాట్లు చేసిన యువతరానికి అందుకు తగిన కారణాలైతే ఉన్నాయి. కొన్ని లక్ష్యాలనూ ప్రకటించారు. కానీ, రోజులు గడిచేకొద్దీ తమ సిద్ధాంతాలు ఏమిటో తెలియక, తగిన రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేక, నాయకులను ఎంపిక చేసుకోలేక అన్ని విధాలా అయోమయాలకు గురయ్యారు. చివరకు ఎన్నికలు ప్రకటించే వేళకు అనేక గ్రూపులుగా మారి ఎవరి దారి వారిదయింది. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజాలు ఈ సరికే నిరాశకు గురైన స్థితిలో, ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాతి పరిపాలనలు ఏ విధంగా ఉండేదీ అర్థంకాని పరిస్థితి కనిపిస్తున్నది.

స్పష్టత లేని బంగ్లా యువత
బంగ్లాదేశ్‌ విద్యార్థి–యువజనుల తిరుగుబాటు 2024 జూన్‌లో మొదలైంది. అప్పటి ప్రధాని షేక్‌ హసీనా సాగించిన అణచివేతను తట్టుకుని మరింత తీవ్రంగా మారింది. రెండు నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని పరిష్కరించలేక షేక్‌ హసీనా రాజీనామా చేసి భారత దేశానికి పారిపోయి వచ్చారు. ఆ దరిమిలా, నోబెల్‌ బహుమతి గ్రహీత ముహమ్మద్‌ యూనుస్‌ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంట్‌ను రద్దు చేసి కొత్త ఎన్నికలు ప్రకటించారు.

అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా, తిరుగుబాటుతరం ఏమి చేయగలదీ స్పష్టత రాలేదు. వారిలో పలు గ్రూపులు తయారు కాగా, కనీసం కొందరు ముఖ్యులతో కలిపి ఒక నాయకత్వాన్ని ఎంపిక చేసుకోలేక పోయారు. చివరకు కొద్దిమంది కలిసి ‘నేషనల్‌ సిటిజన్‌ పార్టీ’ పేరిట ఒక పార్టీని రిజిస్టర్‌ చేశారు. కానీ అందులో ఐక్యత లేక పోయింది. అంతకన్నా ముఖ్యంగా, తమ సిద్ధాంతం ఫలానా అని నిర్ణయించుకుని దేశానికి తెలియజెప్పలేక పోయారు. 

నమ్మకం కోల్పోయిన తిరుగుబాటు
తిరుగుబాటులో వారికి మద్దతుగా నిలిచిన ప్రజలు కోరుకున్నది నిర్దిష్టమైన నాయకత్వం, సిద్ధాంతాలు గల ఒక ప్రత్యామ్నాయ పార్టీని! విద్యార్థులు, యువకులు దేనికి నిరసనగా,ఏ లక్ష్యాలతో తిరుగుబాటు జరిపారో వాటి నుంచి, పాత పార్టీలకు భిన్నమైన ఒక కొత్త పార్టీని!! కానీ, తిరుగుబాటు రోజుల నుంచి సుమారు సంవత్సర కాలం గడిచినా ఇవేవీ జరగలేదు.

షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ ఇక రంగంలో ఉండదని తేలిపోగా, మిగిలిన రెండు ప్రధానమైనవి ఖలీదా జియా మరణం తర్వాత ఆమె కుమారుడు తారిఖ్‌ రహమాన్‌ నాయకత్వాన గల‘బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ’, ‘జమాతే ఇస్లామీ పార్టీ’లు. విద్యార్థుల తీరు వల్ల వారి పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లగా, ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఎన్‌పీ,జమాతే అగ్రస్థానంలో నిలిచాయి. విద్యార్థుల పార్టీ ఎక్కడో వెనుకబడి పోయింది. దానితో ఆందోళన చెందిన ఆ పార్టీ నాయకత్వం జమాతేతో పొత్తు కలవగా, ఒక మతతత్వ పార్టీతో ఐక్య సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు బయటకు పోయారు. బయటి సమాజంలోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికలలో విద్యార్థుల పార్టీ నుంచి గెలిచేది ఎందరనే ప్రశ్న ఎట్లున్నా, వారి ఉద్యమం ఈ రోజున ఎక్కడ మిగిలింది, తమ లక్ష్యాలను ఏ మేరకు సాధించనున్నది, తమపై ఆశలు పెట్టుకుని బలపరచిన ప్రజలకు ఏమి చెప్పగలదన్నది మౌలికమైన ప్రశ్న. అందులో విఫలమైన పక్షంలో, ఇకభవిష్యత్తులోనూ అవే పాత పార్టీలు అధికారానికి రాగల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున, ఆ నాయకత్వాలు తామేదో మారామని బయటకు చెప్తున్నా అటువంటి ఆశలు ఎవరికీ లేని స్థితిలో, ఉద్యమ ప్రభావాలు శూన్యంగా మిగల నున్నాయంటే పొరపాటు ఉండబోదు. మునుముందు మరొక మారు తిరుగుబాటు తలెత్తితే ప్రజలు విశ్వసించటం తేలిక కాబోదు.

చీలిన నేపాల్‌ గ్రూపులు
నేపాల్‌ను గమనించినా పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. అక్కడి జెన్‌–జీ ఉద్యమం నిరుడు సెప్టెంబర్‌లో ఒకేమారు అగ్నిపర్వతం వలె పేలి కేవలం రెండు రోజులలో ప్రభుత్వాన్ని కూలదోసి, పార్లమెంటును రద్దు చేయించింది. వారి నిరసనలు కూడా బంగ్లాదేశ్‌లో వలె అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, బంధుప్రీతి, ఆర్థిక సమస్యలు, అసమర్థ పాలనకు సంబంధించినవే. అక్కడి ప్రజలు వారిని పూర్తిగా బలపరచి, వారి నాయకత్వాన ప్రత్యామ్నాయ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడగలవని ఆశించారు. తిరుగుబాటు ఆకస్మికం అయినందున దేశమంతటా ఎక్కడికక్కడ కలిపి మొత్తం సుమారు 60 జెన్‌–జీ గ్రూపులు ఉనికిలోకి రాగా, వాటిలో కనీసం కొన్ని ముఖ్యమైనవి ఒక్కటై ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలవనుకున్నారు.

కానీ, నెలలు గడిచిపోతున్నా అది జరగకపోగా అనేక గ్రూపులు తమ గత కాలపు సిద్ధాంతాలు, వ్యక్తిగత అనుబంధాలను బట్టి, లేదా టికెట్లు ఆశించి ప్రధానమైన అయిదు పాత పార్టీలతో చేరాయి. రెండు మూడు గ్రూపులు సొంత పార్టీలు ఏర్పాటు చేశాయి గానీ అవి బలహీనంగా మిగిలిపోయాయి. ఉద్యమకారులకు, ప్రజలకు కూడా తగినంత అభిమానం ఉన్నట్లు భావించే మాజీ ఉపప్రధాని రవి లమిఛానే, ఖాట్మండు మాజీ మేయర్‌ బాలేన్‌ షా, జాతీయ విద్యుత్‌ సంస్థ మాజీ ఎం.డి. ఘీషింగ్‌ కలిసి ఏర్పాటు చేసిన పార్టీ కొన్ని ఆశలు రేకెత్తించింది గానీ, మొదలైన వారం రోజులకే చీలిపోయింది. 

విచిత్రం ఏమిటంటే, ఇంతటి తిరుగుబాటు జరిగి, దాని నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధానులు ఓలీ పార్టీ, ప్రచండ పార్టీ, బాబూరాం భట్టరాయ్‌ పార్టీ, మాజీ ఉపప్రధాని లమిఛానే పార్టీలు ప్రకటించినా, ఆ పాఠాలు ఏమిటో, భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటో వివరిస్తూ మేనిఫెస్టోలను ఏ ఒక్కరూ ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారాలు మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు హతాశులై మిగిలారు.

గత రెండేళ్ళలో బంగ్లాదేశ్, నేపాల్‌లోనే కాదు. మరొక డజను దేశాలలోనూ జెన్‌–జీ తిరుగుబాట్లు జరిగాయి. ఒకటి రెండు చోట్ల కొన్ని రాయితీలు సాధించినా ప్రత్యామ్నాయాలన్నవి ఎక్కడా ఏర్పడ లేదు. ప్రతిచోటా వెనుకటి పార్టీల రాజ్యమే కొనసాగుతున్నది. ఇందులో ఆశ్చర్యం లేదు. ఉద్యమాలు తగినంత కాలం సాగి, తమ వైన సిద్ధాంతాలు, నాయకత్వాలతో ఒక రూపానికి వచ్చి, ప్రజలను మెప్పిస్తే తప్ప, ప్రత్యామ్నాయాలు సిద్ధించవు.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Nepal
Bangladesh
Parliamentary elections
GenZ
movement
Sakshi Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నేపాల్‌ రాజకీయాల్లో ఊహించని  ట్విస్ట్

నేపాల్‌ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్

ఆగని 'గ్రేటర్‌ ఇజ్రాయెల్‌' పథకం

ఆగని 'గ్రేటర్‌ ఇజ్రాయెల్‌' పథకం

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

‘మా నాన్నెవరో తెలుసా?’

‘మా నాన్నెవరో తెలుసా?’

రిస్క్‌ తీసుకుంటేనే 'నవలోకాలు'!

రిస్క్‌ తీసుకుంటేనే 'నవలోకాలు'!

రూపాయిని ఎంతకాలం నిలబెడతారు?

రూపాయిని ఎంతకాలం నిలబెడతారు?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.