సాక్షి, తాడేపల్లి: ఏపీ స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఎన్నికల్ని హైజాక్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదంటూ మండిపడ్డారు. దేశంలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదని, వీటిని ఎన్నికలంటారా? అని ప్రశ్నించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారని, పోలీసులే ఎదుటే రిగ్గింగ్ చేశారనేది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఈ రోజు(గురువారం, నవంబర్ 5వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్లో చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విధానాన్ని తూర్పారబట్టారు వైఎస్ జగన్.
‘ఇవి ఎలక్షన్లా? లేక సెలక్షన్లా? అన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దేశ చరిత్రతో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదు. ఎన్నికల ప్రక్రియను మొత్తం కబ్జా చేశారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే బైండోవర్ కేసుల పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టారు. మా నేతల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.
ప్రజాస్వామ్యాన్ని అన్నీ రకాలుగా ఖూనీ చేశారు
‘ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగడం లేదు. అధికార దుర్వినియోగంతో, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని అన్నీ రకాలుగా ఖూనీ చేశారు. పారదర్శకంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసి చంద్రబాబు మరింత దయనీయ స్థితికి దిగజారారు’ అని ధ్వజమెత్తారు.
స్క్రూటినీ సమయంలో అధికారులే పత్రాలను చింపేశారు. పోలీసులు, అధికారులు మాఫియా ముఠాగా ఏర్పడ్డారు. అడ్డుకోవాల్సిన ఎస్ఈసీ చంద్రబాబుకు తొత్తుగా మారింది. 17 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల మా నామినేన్లను తిరస్కరించారు. 22 మున్సిపాలిటీల్లో నామినేషన్లలోనే పోటీ లేకుండా చేశారు.
కొన్ని చోట్ల మా పార్టీ నేతలను పోటీలోనే లేకుండా చేశారు. పలు బూత్‌లలో మా ఏజెట్లను కూర్చోనివ్వలేదు. పోలీసుల ఎదుట రిగ్గింగ్ చేసిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఎన్నికలు.. అసలు ఎన్నికలేనా? 84 జడ్పీటీసీల్లో మా నేతలను నామినేషన్లు వేయనివ్వలేదు.
ఇదీ చదవండి: చంద్రబాబు గెలిచి ఓడితే.. మేం ఓడి గెలిచాం: వైఎస్ జగన్
2,109 ఎంపీటీసీ స్థానాల్లో కూడా నామినేషన్లు వేయనివ్వలేదు. మా అభ్యర్థులను అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు. ఏజెంట్లను బూత్‌ల్లోకి వెళ్లకుండా పోలీసులే అడ్డుకున్నారు. ప్రతిపక్ష పార్టీని పోటీ చేయనివ్వకపోతే ఎన్నికలు ఎందుకు?.
నామినేషన్లు రిగ్గింగ్.. స్క్రూటినీ రిగ్గింగ్. పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్..పోలింగ్ సైక్లింగ్ రిగ్గింగ్. పోలింగ్ పర్సంటేజ్‌లు.. బ్యాలెట్ బాక్స్‌లు సైతం రిగ్గింగ్. ఇవన్నీ దాటుకుని మా వాళ్లు గెలిస్తే.. ఆ ఫలితాను కూడా రిగ్గింగ్ చేశారు. చంద్రబాబు వీటిని గెలుపుగా చెప్పుకోవడం సిగ్గు చేటు. కూడేరులో వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలీసులు నిర్బంధించారు. మురట్లోలో టీడీపీ రిగ్గింగ్ చేస్తుంటే సీఐ రాజు కాపలాకాశారు.
వెలిగండ్ల గ్రామంలో వైఎస్సార్సీపీ ఏంజెంట్లను లాగి పడేశారు. సుంకేశుల గ్రామంలో ఏజెంట్ల ఫామ్‌లను చింపేసి దాడి చేశారు. చంద్రగిరి సాయి నగర్లో టీడీపీ దొంగ ఓటర్లను వైఎస్సార్సీపీ నేతలు పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ రిగ్గింగ్ చేసింది. పులివెందుల అచ్చివెల్లిలో ఓటర్లపై పోలీసుల లాఠీఛార్జ్.వేములలో స్లిప్పులిచ్చేసి వెళ్లాలని ఓటర్లను బెదిరించారు. లింగాల మండలంలో దాడి చేసేందుకు.. టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారు.
ఈ మేరకు కూటమి ప్రభుత్వం అండదండలతో పొలీసులు, ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా కబ్జా చేశారో కొన్ని విజువల్స్‌ను వైఎస్ జగన్ ప్లే చేసి చూపించారు.
వేములలో ఏజెంట్లను పోలీసులే అడ్డుకొని వెళ్లగొట్టారు. మోటునూతనపల్లిలో మహిళా ఓటర్లపై లాఠీఛార్జ్ చేశారు. రైల్వేకోడూరు నల్లపురెడ్డిపల్లెలో పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో టీడీపీ గూండాలు దాడి చేశారు. ప్రకాశం జిల్లా శివరాంపురంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు పంపేశారు. ఎన్టీఆర్ వత్సవాయిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదు. ఎన్నికల ప్రక్రియను మొత్తం కబ్జా చేశారని ’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.