సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఆనందం టీడీపీ నేతలు, కార్యకర్తల ముఖాల్లో కనిపించడం లేదు. ప్రజల మనసు గెలిచామన్న ధీమా లేదు. విజయాన్ని ఘనంగా చాటుకునే ఉత్సాహం లేదు. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు సాగిన అక్రమాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం.. గెలుపు సంబరాలనే నీరుగార్చాయి. ప్రజాబలంతో గెలిస్తే వీధివీధినా విజయోత్సవాలు జరిగేవి. కానీ ఇక్కడ గెలిచిన పార్టీ మౌనంగా ఉంటే.. ఓడిన ప్రతిపక్షం మాత్రం పోరాట పటిమతో నిలిచింది. రెండున్నరేళ్ల పాలనలోనే ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నామన్న అంతర్మథనం టీడీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది.
బాబు మౌనం.. లోకేశ్ మౌనం
ప్రజాస్వామ్యానికి పాతరేసి అన్ని వ్యవస్థలను నీరుగార్చి గెలిచినా.. ఈ ఫలితాలపై చంద్రబాబు గానీ, ఆయన తనయుడు లోకేశ్ గానీ మంగళవారం రాత్రి వరకూ స్పందించలేదు. ఆ తర్వాత స్పందించినా అందులో గెలిచిన ఆనందం లేదు. చంద్రబాబు తుపాను సమీక్షలకే పరిమితమయ్యారు. లోకేశ్ రాప్తాడు బాలిక ఘటనపై మాట్లాడారు. చిన్న ఉప ఎన్నిక గెలిచినా ట్వీట్లతో హోరెత్తించే నేతలు ఈ విజయంపై మౌనం దాల్చడం వెనుక అర్థం ఏమిటని సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.
ఏజెంట్లను గెంటేసిన బూత్‌లు, రీకౌంటింగ్‌లో తారుమారైన ఫలితాలు, బెదిరింపులతో ఖాళీ చేయించిన బరుల గురించి నిలదీస్తే సమాధానం లేదు. అందుకే గెలుపును ఆస్వాదించే ధైర్యం కూడా టీడీపీ చేయలేకపోతోందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మౌనమే టీడీపీ నైతిక ఓటమికి అతిపెద్ద సాక్ష్యమని విశ్లేషకులంటున్నారు. ‘రాయలసీమ నుంచి కోస్తా వరకు ఎన్ని ఆగడాలు జరిగాయో రాష్ట్రమే కాదు దేశమంతా చూసింది. ఇదో పెద్ద విజయంలా సంబరాలేం చేసుకుంటాం’ అని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
అలా గెలిస్తే.. ఊరేగింపులుండేవిగా..
నామినేషన్ల దశనుంచే ఇష్టారాజ్యం సాగింది. ప్రతిపక్ష అభ్యర్థులను బైండోవర్లతో బెదిరించి బరినుంచి తప్పించారు. దశకుట్రలతో ప్రజాస్వామ్యాన్ని ఉరితీశారు. పోలింగ్ రోజు ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు గెంటేశారు. కౌంటింగ్‌లో రీకౌంటింగ్ల పేరుతో ఫలితాలు తిప్పేశారు. ఇదంతా తమ కళ్లెదుటే జరిగిందని టీడీపీ కిందిస్థాయి కార్యకర్తలే చెబుతున్నారు. ఓటరు ఇచ్చిన ఓటుతో గెలిచి ఉంటే గర్వంగా ఊరేగింపులు తీసేవాళ్లమని, ఇలా గెలిచాక వీధుల్లో తలెత్తుకు తిరగలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు.
దీనిని కొలమానంగా తీసుకోలేం..
ఈ ఫలితాలను అసలైన ప్రజాతీర్పుగా చెప్పుకోలేని పరిస్థితి టీడీపీలోనే నెలకొంది. ఇలాంటి గెలుపును కొలమానంగా తీసుకోలేమని ద్వితీయ శ్రేణి నేతలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అసలు బలం ఎంతో తెలుసుకునే అవకాశం పోయిందని, ఈ ఫలితాలు చూసి భ్రమపడితే ఇంకా మునిగిపోతామని సీనియర్లు సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికలు నల్లేరుపై నడక కావాలి. అలాంటిది ఇంతటి బలప్రయోగం అవసరమైందంటేనే జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమైపోయిందని రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఇంటింటికీ వెళ్లినప్పుడే అర్థమైంది
ప్రచారంలో ఇంటింటికీ తిరిగినప్పుడే ప్రజల వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని టీడీపీ కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని, ఆగిపోయిన పథకాల సంగతేంటని, చంద్రబాబు సంతకాలు చేసి ఇచ్చిన బాండ్ల పరిస్థితి ఏమిటని మహిళలు నిలదీశారని, సమాధానం చెప్పలేక వెనక్కి వచ్చామని పలువురు చెబుతున్నారు. ఆ భయంతోనే ఏం చేసైనా గెలవాలని చంద్రబాబు.. మంత్రులు, ఎమ్మెల్యేలపై మెడపై కత్తి పెట్టారు. వారు అధికార బలంతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని గెలుపు ముసుగు వేసుకున్నారు. ఇంత నిర్బంధంలోనూ ఓటర్లు మనసులో మాట చెప్పిన చోట్ల ఫలితాలు అధికార పక్షానికి చెంపపెట్టు అయ్యాయి.
ఎదురొడ్డి నిలిచిన వైఎస్సార్సీపీ
టీడీపీ నేతలు అన్నింటికంటే జీర్ణించుకోలేకపోతున్నది వైఎస్సార్సీపీ చూపిన తెగువ. కేసులు, బెదిరింపులు, పోలీసు నిర్బంధాల మధ్యలోనూ ఆ పార్టీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. నందికొట్కూరులో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. పలుచోట్ల ప్రతి ఓటు కోసం అధికార యంత్రాంగంతో పోరాడింది. అన్నిచోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చి కూటమికి చెమటలు పట్టించింది. ఇంత చేసినా వాళ్లు నిలబడ్డారు, మనం అధికారంలో లేనప్పుడు ఇలా నిలబడగలిగామా అని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
నాడు పారిపోయిన టీడీపీ
ఆ ప్రశ్నకు సమాధానం టీడీపీ చరిత్రలోనే ఉంది. గత స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో ఆ పార్టీ ఎన్నికలనే బహిష్కరించి బరి నుంచి పారిపోయింది. కనీసం పోటీలో నిలిచే ధైర్యం కూడా చేయలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్సీపీ మాత్రం ఇంతటి అణచివేత మధ్య కూడా ఎదురొడ్డి పోరాడింది. ‘ఓడిన పార్టీలో ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. గెలిచిన పార్టీలో గెలుపు కళ కనిపించడంలేదు.’ అని విశ్లేషకులంటున్నారు.