న్యూఢిల్లీ: స్థానిక ఎన్నికలపై వైఎస్సార్సీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 27 నాటి విచారణకు సంబంధించిన ఆర్డర్ కాపీ రిలీజ్ చేసింది. వైఎస్సార్సీపీ ఆధారాలపై సుప్రీంకోర్టు స్పందించింది. నామినేషన్లు అడ్డుకుంటే అక్రమంగా రిజెక్ట్ చేసినట్లేనని చెప్పింది. ఆధారాలు పరిశీలించి పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అభ్యర్థి అనుమతి లేకుండా నామినేషన్ రిజెక్ట్ చేస్తే న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయని సుప్రీంకోర్టు చెప్పింది. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు సీసీ ఫుటేజీ భద్రపరచాలి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సీసీ ఫుటేజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవే..
-
ఏపీలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు సీసీటీవీ ఆదేశాలు వర్తింపు.
-
మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలన్నింటికీ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ తప్పనిసరి.
-
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సీసీటీవీ/వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని ఆదేశం.
-
పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు.
-
స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ తప్పనిసరి.
-
ఎన్నికల పిటిషన్ల దాఖలుకు నిర్ణయించిన గడువు ముగిసే వరకు వీడియో ఫుటేజీని భద్రపరచాలని ఆదేశం.
-
ఎన్నికల పిటిషన్ దాఖలైతే కేసు తుది పరిష్కారం అయ్యే వరకు వీడియో ఫుటేజీని భద్రపరచాల్సిందే.
-
ఎన్నికల ట్రిబ్యునల్ కోరినప్పుడు సంబంధిత వీడియో ఫుటేజీని అందించాలని సుప్రీంకోర్టు ఆదేశం.
-
ఎన్నికల పిటిషన్లో భాగస్వాములైన వారికి దరఖాస్తుపై వీడియో ఫుటేజీ అందుబాటులో ఉంచాలని ఆదేశం.
-
రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం.
-
అభ్యర్థులు నిరాటంకంగా నామినేషన్లు వేసేందుకు పోలీసు బందోబస్తు కల్పించాలని డీజీపీకి ఆదేశం.
-
అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించేలా అక్టోబర్ 27న సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు.








